- లోటు పాట్లు లేకుండా నవమి ఏర్పాట్లు చేయాలి.
- పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న సీఎం.
- సీఎం రేవంత్ రెడ్డి రాక కోసం నాలుగు హెలిపాడ్లు ఏర్పాటు.
- భక్తుల కోసం 200 క్వింటాళ్ళ తలంబ్రాలు సిద్ధం.
- లడ్డూ, తలంబ్రాలు పంపిణీకి 99 కౌంటర్లు ఏర్పాటు.
- భద్రాచలం, సారపాక, ఏటపాకలో మద్యం దుకాణాలు బంద్.
- శ్రీరామ నవమి ఏర్పాట్లపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.
- భద్రాచలంలో జిల్లా అధికార్లతో సమీక్షా సమావేశం.
ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: రాముడు వెలసిన అయోధ్య కన్నా, దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన, రాముడు నడ యాడిన భద్రగిరే భారత దేశానికి తల మానికమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. అటువంటి రాముడి కళ్యాణానికి దేశ విదేశాల నుంచి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున, ఎటువంటి లోటు పాట్లు లేకుండా చూడాలని అధికార్లను ఆదేశించారు.శుక్రవారం భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం, పట్టాభిషేకం మహోత్సవాల నిర్వహణపై ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేసేందుకు రానున్నట్లు చెప్పారు.ఈ నేపధ్యంలో జిల్లా యంత్రాంగం సమన్వయంతో వారికి అప్పగించిన బాధ్యతలే కాకుండా, తోటి అధికార్ల బాధ్యతలు కూడా తీసుకొని, వీవీఐపీలకు,వీఐపీలకు, రామ భక్తులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మర్యాదగా వ్యవహరించాలని, అందరూ తనవి తీర కళ్యాణం తిలకించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.ఈనెల 6న స్వామి వారి కళ్యాణం ఉదయం 10:30 నుండి 12 గంటల 30 నిమిషాల వరకు, అలాగే 7న మహా పట్టాభిషేకం ఉదయం 10:30 గంటల నుండి 12:30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం స్వామి వారి కళ్యాణం టికెట్ల దేవస్థానం సీఆర్ఓ కార్యాలయం, భద్రాచలం ఆర్డీవో కార్యాలయాలలో అందుబాటులో ఉంచామని, అలాగే ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి ప్రత్యేక యాప్ కూడా ఏర్పాటు చేశామన్నారు. స్వామి వారి తలంబ్రాలు, ప్రసాదాలు పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు, అత్యవసర చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తుమ్మల వివరించారు. ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో 50 బెడ్లు, ప్రత్యేక వార్డు, పర్ణశాలతో కలుపుకొని 13 మెడికల్ క్యాంపులు,మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది,సరి పడా మందులు అందుబాటులో ఉంచుకున్నామన్నారు. కళ్యాణం తిలకించడానికి మండపాన్ని 26 సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్కు ప్రత్యేక అధికార్లను నియమించడం జరిగిందన్నారు. భక్తులకు మంచి నీరు, మజ్జిగ పాకెట్లు ఏర్పాటు చేశామని, పార్కింగ్ ప్రదేశాలతో పాటు ఏడు చోట్ల డ్రమ్ములు ఏర్పాటు చేసి గ్రామపంచాయతీ ద్వారా మంచి నీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. కరకట్ట నుండి కళ్యాణం జరిగే స్టేడియం, భద్రాచలం పట్టణం, దేవాలయం పరిసరాలలో ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా 35 చోట్ల 350 మంది గ్రామ పంచాయతీ సిబ్బందిని అందుబాటులో ఉంచామని చెప్పారు.స్వామి వారి తలంబ్రాలు పంపిణీకి 80 కౌంటర్లు, లడ్డూల సరఫరాకు 19 కౌంటర్లు, ప్రతిరోజు లక్షన్నర లడ్లు, భక్తులకు అందించేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.ఈ సంవత్సరం భక్తులకు తలంబ్రాల కొరత రాకుండా 200 క్వింటాళ్లు తయారు చేసి సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. కళ్యాణానికి తెలంగాణ సీఎం వస్తున్నందున బీపీఎల్లో మూడు చోట్ల హెలిపాడ్లతోపాటు అదనంగా టొబాకో బోర్డులో కూడా హెలిప్యాడ్ సిద్ధం చేయాలని, భారీ కేడింగ్ తో పాటు సారపాక నుండి కళ్యాణ మండపం వరకు రోడ్డుకి ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేయాలని, రోడ్డు శుభ్రంగా ఉండేలా చూసు కోవాలని ఆర్ అండ్ బి అధికార్లను ఆదేశించారు. కళ్యాణము, పట్టాభిషేకం పూర్తయ్యే వరకు విద్యుత్ సమస్య రాకుండా చూడాలన్నారు. అవసరమైతే 500 కెపాసిటీ గల కేవీ జనరేటర్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. భక్తులు గోదావరి లోకి వెళ్లకుండా భారీ కేడింగ్ ఏర్పాటు చేయాలని,రిస్క్ బోట్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు.కళ్యాణం, పట్టాభిషేకం అయ్యే వరకు భద్రాచలంతో పాటు సారపాక, ఏటపాకలో ఉన్న బార్ షాపులు మూయించాలని, వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఎక్సైజ్ అధికార్లను ఆదేశించారు. అంతకు ముందు తుమ్మల కళ్యాణం జరగనున్న మిథులా స్టేడియాన్ని పరిశీలించారు.ఈ సమావేశంలో అటవీ అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ పోదెం వీరయ్య, భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకటరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో బి, రాహుల్, ఎస్పీ రోహిత్ రాజ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్, ఆర్డీవో దామోదర్ రావు, ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
