Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్యే ఆన్ వీల్ @ మానకొండూర్

  • అమెరికా తరహాలో టెక్నాలజీ వినియోగం.
  • మానకొండూరు పాలనలో సాంకేతిక విప్లవం.
  • 2.25 లక్షల ప్రజల ఓటరు ఐడీల అనుసంధానం.
  • సాంకేతిక పరిజ్ఞానంతో సమస్యల పరిష్కారం.
  • నేరుగా ప్రజల వద్దకే ఎమ్మెల్యే, అధికారుల బృందం.

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : అమెరికా తరహాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ పరిపాలనలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా టెక్నాలజీతో పాలన వైపు అడుగులు వేస్తున్న మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తో “ముద్ర” కరీంనగర్ బ్యూరో నర్సింగోజు మహేంద్ర చారి ప్రత్యేక ఇంటర్వ్యూ.

(కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పరిపాలనలో సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. టెక్నాలజీని వినియోగిస్తూ నియోజకవర్గ ప్రజల సమస్యలను ఆన్ లైన్ ద్వారానే పరిష్కరించే విధంగా యాప్ కు రూపకల్పన చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో ఉన్న 2లక్షల 25 వేల మంది ప్రజలు ఇంట్లోనే కూర్చుని తమ సమస్యలను పరిష్కరించుకునే విధంగా యాప్ ను రూపొందించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరుస్తూ “ఎమ్మెల్యే ఆన్ వీల్” వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఎమ్మెల్యే, ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎస్సై, వైద్యాధికారి తో పాటు పలు విభాగాల అధికారులు గ్రామానికి వచ్చి ప్రజల ఆర్జీలను స్వీకరించి అక్కడే పరిష్కారం మార్గాన్ని చూపుతారు విద్యావంతుడైన ఎమ్మెల్యే సొంత ఆలోచనతో సాంకేతిక విప్లవానికి తెర తీశారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా సాంకేతికతతో పరిపాలన అందించనున్నారు)

  • ప్రశ్న : “ఎమ్మెల్యే ఆన్ వీల్స్” ఆలోచన మీకు ఎలా వచ్చింది ?

జవాబు : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ వినియోగిస్తూ ప్రపంచం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది.అమెరికా లాంటి దేశంలో ఇంట్లో నుండే వారి సమస్యలను పరిష్కరించుకుంటారు.మరి నా మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు ఆ తరహాలో పరిపాలనను అందించాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పరిపాలన సౌలభ్యం కలిగించాలన్న దృక్పథం లో నుండి పుట్టిందే “ఎమ్మెల్యే ఆన్ వీల్స్” ఆలోచన.

  • ప్రశ్న : సమస్యల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగిస్తారు ?

జవాబు : “ఎమ్మెల్యే ఆన్ వీల్స్” అనే ప్రత్యేక ఆప్ ను రూపొందించాము. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంచాము. మానకొండూరు నియోజకవర్గం లోని 6 మండలాల్లో రెండు లక్షల 25 వేల ఓటరు ఐడెంటి కార్డులను యాప్ లో అనుసంధానం చేశాము.ప్రజల సమస్యలను స్వీకరించడానికి ప్రధానంగా వినియోగిస్తాము.ఇందులో అభ్యర్థన, సూచన, ఫిర్యాదు అను మూడు విభాగాలుగా ప్రజలు ఉపయోగించుకోవచ్చు.

  • ప్రశ్న : టెక్నాలజీ వినియోగంతో జవాబు దారితనం ఎలా ఉండబోతుంది ?

జవాబు : వారంలో మూడు రోజుల చొప్పున ఒక్కో రోజు మూడు గ్రామాలకు వెళతాము. అక్కడ ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలను యాప్ లో పొందుపరుస్తాము.వాహనంలో నాతోపాటు ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎస్సై, ఎలక్ట్రిసిటీ ఏఈ, విద్య, వైద్యాధికారి తో పాటు పలు శాఖల అధికారులు ఉంటారు.వారు వాహనంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్లో ఆర్జీదారుని సమస్యను పరిశీలించి అక్కడికక్కడే పరిష్కారం చూపుతారు.అలాగే యాప్ ద్వారా వచ్చిన ఆర్జీలను సంబంధిత శాఖలకు పంపిస్తాము. అధికారులకు పంపించిన విషయం ఆర్జీదారులకు మెసేజ్ రూపకంగా వెళుతుంది. అప్పుడు అధికారులు యాప్ లో వచ్చిన ఆర్జీలను పరిశీలించి రెండు మూడు రోజుల్లో పరిష్కరిస్తారు. దీంతో పాలన పట్ల జవాబు దారితనం, విశ్వాసం పెరుగుతుంది.

  • ప్రశ్న : యాప్ ను ఉపయోగించడం వల్ల ప్రజలకు ఎలా మేలు జరుగుతుంది ?

జవాబు : నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి, జిల్లా కేంద్రానికి, సంబంధిత శాఖల కార్యాలయాలకు వెళుతుంటారు.ఈ క్రమంలో వారికి నేను అందుబాటులో ఉంటానో ఉండనో అన్న అనుమానం ఉంటుంది.ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేని కలవనిస్తారో లేదో అని గ్రామంలోని చోటామోటా లీడర్ ను వెంటబెట్టుకొని క్యాంపు కార్యాలయానికి వస్తుంటారు.ఈ క్రమంలో వెంట వచ్చిన వారికి దారి ఖర్చులతో పాటు భోజన ఖర్చులు భరించాల్సి వస్తుంది.దీంతోపాటు వారి విలువైన సమయం వృధా అవుతుంది.సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేయాలనుకున్నాను. ప్రజల వద్దకు ఎమ్మెల్యే కార్యక్రమానికి రూపకల్పన చేశాను.

  • ప్రశ్న : యాప్ వినియోగం పై అధికారులతో సమీక్ష నిర్వహించారా ?

జవాబు : ప్రజల పరిపాలన సౌలభ్యం కొరకు ఇప్పటికే యాప్ పై అధికారులకు అవగాహన కార్యక్రమం చేపట్టాం. సమస్యల పరిష్కారంపై సాంకేతికతను ఎలా వినియోగించుకోవాలో సమీక్ష నిర్వహించాం.అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని ఇప్పటికే గట్టిగా చెప్పాం.టెక్నాలజీ వినియోగంలో మానకొండూరు నియోజకవర్గం రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని చెప్పాము.

  • ప్రశ్న : వాహనంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి ?

వాహనానికి 25 లక్షలు వెచ్చించి అధునాతన ఏర్పాట్లను చేశాం.కంప్యూటర్, వైఫై, ప్రింటర్, స్టేషనరీ తో పాటు ఇతర సామాగ్రిని ఏర్పాటు చేశాం.డే టైం లోనే కాకుండా రాత్రి సమయాల్లో కూడా పనిచేసే విధంగా లైటింగ్ ఏర్పాటు చేశాం. అధికారులు కూర్చుని ఆర్జీలను స్వీకరించే విధంగా సీటింగ్ ఏర్పాటు చేశాం.

  • ప్రశ్న : సరికొత్త పాలనను ఎప్పుడు? ఎవరి చేత ప్రారంభిస్తారు?

జవాబు : ఏప్రిల్ 14 రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ని పురస్కరించుకుని ప్రారంభించాలని నిర్ణయించాం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వర్చువల్ గా ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాం.ఈ అవకాశాన్ని మానకొండూరు నియోజకవర్గం ప్రజలు వినియోగించుకొని సాంకేతిక పాలన విప్లవంతో రాష్ట్ర ప్రజలకు స్ఫూర్తివంతంగా నిలవాలని ఆకాంక్షిస్తున్న.

Leave A Reply

Your email address will not be published.