- రేవంత్ రెడ్డి డమ్మీ సిఎం.
- ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యంతో రాజ్యాంగానికి అవమానం.
- బీజేఎల్పి నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
ముద్ర ప్రతినిధి, నిర్మల్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ డీఫ్యాక్టో సీఎంలా వ్యవహరించడం శోచనీయం అని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుతామనే మిషతో కాంగ్రెస్ జై బాపూ పేరిట కార్యక్రమం చేపడుతుంటే రాజ్యాంగానికి విరుద్ధంగా సచివాలయంలో కాంగ్రెస్ ఇన్చార్జి మంత్రులతో సమావేశం నిర్వహించారని అన్నారు. ఇది రాజ్యాంగాన్ని అవమానించడం కాక మరేమిటని ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక పార్టీ ఇంచార్జిగా ఉన్న వ్యక్తి ఏకంగా సచివాలయానికి వచ్చి మంత్రులతో కలిసి హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ భూముల వ్యవహారాన్ని సమీక్షించడాన్ని ఆయన విమర్శించారు. దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి డమ్మీ సీఎం అనేది స్పష్టమైపోయిందని ఎద్దేవా చేశారు.ఈ తతంగంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనా పగ్గాలను రాహుల్ గాంధీ తన చేతిలోకి తీసుకున్నట్టుగా అర్థమవుతోందని ధ్వజమెత్తారు. బాధ్యతలు తీసుకున్న సమయంలో మీనాక్షి నటరాజన్ ప్రభుత్వ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనని చెప్పారు. కానీ ఆమె మాట తప్పి ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఏకంగా సచివాలయానికి రావడం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇందుకు రాహుల్ గాంధీ ఆదేశాలు ఉన్నాయని స్పష్టంగా తేలిపోయిందన్నారు.
- రేవంత్ రెడ్డి కోరల్లేని పాము.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోనే తన నివాసంలో ఉండగా మీనాక్షి నటరాజన్ ఏకంగా సచివాలయానికి వచ్చి మంత్రులతో కలిసి రివ్యూ చేయడాన్ని బట్టి సీఎం రేవంత్ రెడ్డి ఇక ఒట్టి కోరలు లేని పాము అని అర్థం చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్ తమ విధానమంటున్న కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ తమ ధ్యేయమని కార్యక్రమాలను నిర్వహిస్తూ, పాదయాత్రలు చేస్తున్న కాంగ్రెస్ నేతలకు రాజ్యాంగ పరిరక్షణ విధానం ఓ నినాదం గానే మిగిలిపోయిందని, అది ఆచరణలో శూన్యమని మీనాక్షి నటరాజ్ నిరూపించారన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జులుగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, వయలార్ రవి లాంటి నేతలు ఏనాడు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదన్నారు.
- తండ్రి బాటలోనే రాహుల్.
గతంలో ప్రధానిగా, కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న రాజీవ్ గాంధీ అప్పట్టో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అంజయ్యను ఎయిరుపోర్టులో అవమానించారన్నారు. తండ్రి రాజీవ్ గాంధీ బాటలోనే కుమారుడు రాహుల్ గాంధీ నడుస్తున్నారని ఎద్దేవా చేశారు.
- ఆత్మగౌరవం తాకట్టు.
తెలంగాణ రాష్ట్ర సర్కారును రాహుల్ గాంధీ రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపించాలను కుంటున్నారన్నారు. డీఫ్యాక్టో సీఎం గా వ్యవహరిస్తూ తెలంగాణ సకల జనులు కోట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ పాదాల వద్ద కాంగ్రెస్ తాకట్టు పెట్టడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గెలిస్తే మార్పు వస్తుందన్నారు. రిమోట్ కంట్రోల్ పాలనేనా మార్పు అంటే అని ప్రశ్నించారు.ఇపుడు డమ్మీ సీఎంగా మిగిలిపోయిన రేవంత్ రెడ్డి, త్వరలోనే మాజీ సీఎం గా మారతాడని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతుందని పేర్కొన్నారు.ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, మెడిసెమ్మ రాజు, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, తాజా మాజీ కౌన్సిలర్లు నరేందర్, నవీన్, పద్మాకర్, సత్యం చంద్రకాంత్, ముత్యం రెడ్డి, జమాల్, విలాస్, విజయ్, తిరుమల చారి , ముత్యం తదితరులు పాల్గొన్నారు.