తొలిరోజు 95.70 శాతం హాజరు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. పరీక్షల తొలిరోజు జిల్లాలో 95.70 శాతం హాజరు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ ప్రభుత్వ జూనియర్ బాలబాలికల కళాశాలలోని పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పరీక్ష గదులను సందర్శించి, విద్యార్థులకు కల్పించిన వసతులను పర్యవేక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతరం నిఘా ఉంచాలని సూచిస్తూ, పరీక్ష కేంద్రాల్లోని సీసీ కెమెరాల పనితీరును స్వయంగా పరిశీలించారు. మొదటిరోజు పరీక్షకు మొత్తం 7,076 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, వారిలో 6,772 మంది (95.70%) హాజరయ్యారు. వివిధ కారణాల వల్ల 304 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు ధృవీకరించారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి పరశురాం, తహసీల్దార్ రాజు, అధికారులు, తదితరులు ఉన్నారు.