Take a fresh look at your lifestyle.

నేడు కేబినెట్​ భేటీ

  • కీలకాంశాలపై చర్చ.
  • ఉద్యోగుల పదవీ విరమణ, డీఏ పెంపుపై ప్రత్యేక చర్చ.
  • రాజీవ్ యువ వికాసం, వానాకాలం పంటలు, ఇందిరమ్మ ఇండ్లు, భూ బారతిపై మంతనాలు.
  • మున్సిపల్​, స్థానిక ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై మంతనాలు.
  • కాళేశ్వరం తుది నివేదిక, ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంపై చర్చించనున్న మంత్రివర్గం.
  • ఇప్పటికే పలు అంశాలపై కేబినెట్​ సబ్​ కమిటీల నుంచి నివేదికలు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రివర్గం నేడు భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3గంటలకు సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలు చర్చకు రానున్నాయి.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు మంత్రివర్గ భేటీపై ఇప్పటికే అధికారిక ప్రకటనను విడుదల చేశారు.ఇందులో ఇప్పటికే కొనసాగుతోన్న సంక్షేమ పథకాలు కొత్తగా అమలు చేయతలపెట్టిన పథకాలు, కార్యక్రమాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి గురించీ మంత్రివర్గం చర్చించనున్నది. ప్రధానంగా ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన రాజీవ్​ యువవికాసం పథకం కింద అందిన దరఖాస్తులు.. లబ్దిదారుల ఎంపిక, బడ్జెట్​, యూనిట్ల మంజూరుతో పాటు పథకం పక్కదారి పట్టకుండా చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్​ చర్చించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాజీవ్​ యువ వికాసం అమలులో భాగంగా యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు, స్కిల్ కేంద్రాల ఏర్పాటు అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి.అలాగే ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన ఉన్నతాధికారుల కమిటీ తన నివేదికను మంత్రివర్గ ఉప సంఘానికి అందజేసింది.ఈ నివేదిక గురించి సిఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు.ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో కేబినెట్‌లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందన్నది ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికపై ఈ సమావేశంలో విశ్లేషణ జరుగనున్నట్టుగా తెలిసింది పాత పింఛన్ విధానం, ప్రమోషన్లు, బదిలీలు, ఖాళీల భర్తీ తదితర అంశాలపై తీసుకునే నిర్ణయాలకు సంబంధించి ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. అలాగే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో పథకాలకు సంబంధించి కేబినెట్ ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చని తెలుస్తున్నది. అలాగే వానాకాలంలో పంట సాగు, ఇటీవల కురిసిన వర్షాలతో తడిసిన ధాన్యం, నష్టం, కొనుగోళ్లపై క్షేత్రస్ధాయి నుంచి వివరాలు తెప్పించుకున్న ఆ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే సీఎం రేవంత్​ రెడ్డికి నివేదించారు.రైతు భరోసాకు సమకూర్చాల్సిన నిధుల గురించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు వానాకాలం పంట సాగు, ఎరువులు, విత్తనాల సరఫరాతో పాటు నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలపై మంత్రివర్గం కీలకంగా చర్చించనున్నది. ఇందిరమ్మ ఇండ్లకు వచ్చిన దరఖాస్తులు, ఇప్పటి వరకు గుర్తించిన లబ్దిదారులు, పంపిణీకి సిద్ధంగా అందుబాటులో ఉన్న ఇండ్లు, నిర్మాణదశలో ఉన్నవి, కొత్తగా నిర్మించాల్సిన ఇండ్ల అంశమూ చర్చకు వచ్చే అవకాశం ఉంది.ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల లబ్దిదారులకు ఇండ్లు మంజూరు చేసిన నేపథ్యంలో ప్రజల స్పందన, వ్యతిరేకతపైనా చర్చ జరిగే ఛాన్స్​ ఉంది. మరో కీలక పథకమైన భూభారతి చట్లం అమలును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం..క్షేత్రస్ధాయిలో భూ సమస్యలపై దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నది.ఈ క్రమంలో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులపై చర్చించనుంది.వీటితో పాటు ఏపీ ప్రభుత్వం గోదావరి నదిపై అక్రమంగా నిర్మించతలపెట్టిన బనకచర్ల, పోలవరం ప్రాజెక్టులను జాతీయ స్ధాయిలో అడ్డుకునేందుకు చేపట్టాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం రేవంత్​ రెడ్డి మంత్రుల సలహాలు, సూచనలు తీసుకోనున్నారు.ఈ అంశంపై అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం.అలాగే త్వరలోనే విద్యా సంవత్సరం ప్రారంభమవుతోన్న నేపథ్యంలో విద్యారంగ సమస్యలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం అంశమూ చర్చకు వచ్చే అవకాశం ఉంది.కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ నివేదికలపై కేబినెట్ లో చర్చ జరగనుంది.ఇందులో లోపాల పరిశీలన, బాధ్యుల నిర్ధారణ, తదుపరి చర్యలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం.

Leave A Reply

Your email address will not be published.