Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు పెరగాలి

  • రైతు కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెరగాలని రైతు కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం రంగారెడ్డి జిల్లా యాచారంలో స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితో కలిసి రైతు కమిషన్ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టు కింద మూడు గ్రామాల్లో సాగు అవుతున్న కూరగాయ పంటలను పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అలాగే యాచారంలో మోడల్ మార్కెట్ ఏర్పాటుకు సంబంధించి స్థల సేకరణను పరిశీలించారు. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ మహానగరానికి నిత్యం కూరగాయలను అందించడంలో రంగారెడ్డి జిల్లా రైతుల పాత్ర కీలకమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూరగాయల సాగు విస్తీర్ణం పెరగాలన్నారు.ఇతర రాష్ట్రాల నుండి నిత్యం కూరగాయల దిగుమతి చేసుకుంటున్న విషయాన్నీ ఈ సందర్బంగా గుర్తుచేశారు. కూరగాయలు పండించే యాచారం ప్రాంతాన్ని ఉమ్మడి ఏపీలోని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హార్టికల్చర్ హబ్‌గా ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. అలాగే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా రైతాంగ సంక్షేమం కోసం అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు. రాష్ట్ర రైతాంగానికి ఆదర్శంగా ఉండేలా యాచారం మండలంలోని గడ్డిమల్లయ్య గూడ, చౌదర్ పల్లి, మొండి గౌరెల్లి గ్రామాల్లో కూరగాయల సాగును పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో కూరగాయల సాగుకు అనుకూలంగా ఉన్న అన్ని గ్రామాల్లో ఉద్యానవన పంటలను ప్రోత్సహిస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. యాచారంలో ఫార్మాసిటి రాకుండా అడ్డుకున్నామని తెలిపారు.అయితే ఈ ప్రాంతంలో ఫార్త్ సిటీ కోసం భూ సేకరణ చేయాల్సి వస్తే రైతులు నష్టపోకుండా వారికి నచ్చిన ధరకే ప్రభుత్వం భూములను కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఫోర్ సిటీ అందుబాటులోకి వస్తే యాచారం చుట్టుపక్కల రైతులు సిటీకి వెళ్ళి కూరగాయలు అమ్ముకోవల్సిన అవసరం ఉండదని, ఈ ప్రాంతంలోనే అమ్ముకోవచ్చని ఆయన తెలిపారు. ఫోర్త్ సిటీ ఆషామాషీగా ఉండదని, ఫోర్త్ సిటీలో ఇక్కడి యువతకు ఉద్యోగాలు వస్తాయని, భూముల ధరలు భారీగా పెరుగుతాయన్నారు.

Leave A Reply

Your email address will not be published.