ముద్ర, తెలంగాణ బ్యూరో: లండన్ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోట పెట్టుబడుల మాట ఆసక్తిగా మారింది. తెలంగాలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలంటూ కోరారు.రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, సంబంధిత శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇటీవల విదేశీ పర్యటనలతో బిజిబిజిగా గడిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ బాధ్యతలను కేటీఆర్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.యుకే పర్యటనలో ఉన్న కేటీఆర్ ను కొందరు పారిశ్రామికవేత్తలు, యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన పై విధంగా విజ్ఞప్తి చేశారు.అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, వ్యాపార నిర్వహణకు ఎదురవుతున్న సవాళ్లతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి నిరోధక విధానాలపై సమావేశంలో చర్చించారు.ముఖ్యమంత్రిగా కేసీఆర్ అమలుచేసిన ప్రగతిశీల విధానాలు, తీసుకున్న పారిశ్రామిక అనుకూల నిర్ణయాలతో పది సంవత్సరాల కాలంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎన్నో సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన సంగతిని కేటీఆర్ ప్రస్తావించారు.యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి కార్పోరేట్ దిగ్గజాలకు తెలంగాణ నయా చిరునామాగా మారిందన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు, తీసుకువచ్చిన పారదర్శక విధానాలతో పారిశ్రామిక రంగంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంతా తెలంగాణ గడ్డను ప్రేమించే వ్యక్తిగా అధికారంలో ఉన్న లేకున్నా రాష్ట్ర అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని కేటీఆర్ తెలిపారు.తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత సహకారం అందించాలని సమావేశానికి హాజరైన వారికి ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రగతికి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని కోరారు.పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి కోసం చిత్తశుద్దితో పని చేస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
త్వరలో ఇంగ్లాండ్ లో పార్టీ రజతోత్సవ వేడుకలు.
బీఆర్‌ఎస్ 25 సంవత్సరాల సిల్వర్‌జూబ్లీ సంబరాల‌్లో భాగంగా యునైటెడ్ కింగ్డమ్ లోనూ పార్టీ రజతోత్సవ సంబరాలను నిర్వహించనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. లండన్ పర్యటనలో ఉన్న కేటీఆర్, అక్కడ పార్టీ ఎన్.ఆర్.ఐ నేతలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎన్.ఆర్.ఐ విభాగం నుంచి వచ్చిన ఓ విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారు. పార్టీ రజతోత్సవ వేడుకలను ఏడాదిపాటు ఘనంగా నిర్వహించాలన్న పార్టీ అధినేత కేసీఆర్ సూచన మేరకు ఇంగ్లాండ్ లో కూడా నిర్వహించాలని ఎన్.ఆర్.ఐ నేతలు కేటీఆర్ ను కోరారు. ప్రాంతాలకు అతీతంగా యుకేలో ఉన్న తెలుగు వాళ్లంతా ఈ సంబరాల్లో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు.దీంతో పార్టీ రజతోత్సవ సంబరాలను యుకే లో నిర్వహించడానికి కేటీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే తెలంగాణలో వరంగల్ బహిరంగ సభ ద్వారా రజతోత్సవ సంబరాలను ప్రారంభించినట్లు తెలిపిన కేటీఆర్, ఏడాది కాలం పాటు వివిధ రూపాలలో, దేశ విదేశాలలో ఈ సంబరాలను కొనసాగించనున్నట్లు తెలిపారు.అందులో భాగంగా అమెరికాలోని డల్లాస్ నగరంలో జూన్ 1వ తేదీన సిల్వర్ జూబ్లీ సమావేశాలను నిర్వహిస్తునున్నారు, ఇదే క్రమంలో యూకేలోను సంబరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సంబరాలకు స్వయంగా తాను హాజరు కావడంతో పాటు, పార్టీ సీనియర్ నేతలు, తెలంగాణ కళాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నట్లు కేటీఆర్ తెలిపారు.