- భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ గురించి వాస్తవాలు చెప్పాలని అనుకుంటే లేఖలు, లీకులు కాదని.. అందుకు అవసరమైన ఆధారాలు కవిత బయటపెట్టాలని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో పదేళ్లలో జరిగిన అవినీతిపై కవిత దర్యాప్తు కోరాలని అన్నారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. దెయ్యాలు ఎవరో కవిత బయటపెట్టాలన్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ అవినీతిపై దర్యాప్తు కోరాలని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి రాజకీయాలు చేస్తున్నాయని తమ నేతలు మొదటి నుంచి చెబుతునే ఉన్నారని గుర్తు చేశారు. గురువారం కవిత చేసిన వ్యాఖ్యలు దాన్ని నిజం చేశాయని చెప్పారు. కాంగ్రెస్‌కు కవిత అవసరం లేదని స్పష్టం చేశారు. తమకు సమర్థమైన నాయకత్వం ఉందని.. తమ పార్టీలోకి కొత్త వాళ్లు అవసరం లేదన్నారు.