Take a fresh look at your lifestyle.

అస్తిత్వ పోరాట ప్రతిక తెలంగాణ.. : మంత్రి లక్ష్మణ్ కుమార్

సాయుధ పోరాటం నుండి రైతాంగ పోరాటం వరకు మరువలేని చరిత్ర..
జిల్లా అభివృద్ధికి సంక్షేమానికి సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు..
ప్రజా పాలన దినోత్సవం వేడుకల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్..

ముద్ర, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రం అంటే ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదని అస్తిత్వ పోరాటానికి ప్రత్యేకగా తెలంగాణ నిలుస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించిన వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి లక్ష్మణ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

మొదట కరీంనగర్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళ్లు అర్పించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రతో పాటు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలాంతో కలిసి వేడుకల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈసందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ “తెలంగాణ ప్రజాపాలన” వేడుకలకు హాజరైన తెలంగాణ పోరాట యోధులకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, అధికారులకు, నగర ప్రముఖులకు, జర్నలిస్టులకు, ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 17 సెప్టెంబర్ 1948 సంవత్సరంలో తెలంగాణ నిజాం చెర నుండి విముక్తి పొంది, అఖండ భారత్ లో విలీనమైంది ఈ రోజు అని గుర్తు చేశారు.

ఇంతటి ప్రాముఖ్యత గల సెప్టెంబరు 17వ తేదీని “తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం”గా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని, తెలంగాణ రాష్ట్రం అనేది ఒక భౌగోళిక స్వరూపం మాత్రమే కాదని ఇది ఒక అస్తిత్వ పోరాటానికి ప్రతీక అని మంత్రి అన్నారు.

‌అనాదిగా అణగదొక్కబడిన తెలంగాణ ప్రాంతంలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం దశాబ్దాలుగా పోరాటాలు నిరంతరం కొనసాగాయని అన్నారు. నాటి ప్రఖ్యాతి గాంచిన “తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం” నుండి నేటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు ఉవ్వెత్తున చేసిన అనేక పోరాటాలు చరిత్రలో ప్రసిద్ధిగాంచాయని అన్నారు.

తెలంగాణ గడ్డపై జన్మించి ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేసిన ఆనాటి వీరయోధులకు జోహార్లు అర్పిస్తున్నమని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని మంత్రి తెలిపార. “తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం” పురస్కరించుకుని మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “మహాలక్ష్మీ” పథకంలో భాగంగా 9 డిసెంబర్‌ 2023న ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని జిల్లాలో మహిళలు, బాలికలు సద్వినియోగం చేసుకుంటున్నారని ఇప్పటి వరకు రూ. 8 కోట్ల 38 లక్షల ప్రయాణాలు చేసి, తద్వారా రూ. 383 కోట్ల 56 లక్షల రూపాయల లబ్ధి పొందారని మంత్రి తెలిపారు.

పౌరసరఫరాల శాఖ ద్వారా కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక లక్షా 58 వేల లబ్దిదారులకు 11 లక్షల 93 వేల గ్యాస్‌ సిలిండర్లను 500 రూపాయలకే సరఫరా చేయడం జరిగిందని ఇందుకు గాను 39 కోట్ల 44 లక్షల రూపాయల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని వివరించారు. “గృహజ్యోతి” పథకం ద్వారా 200 యూనిట్ల లోపు విద్యుత్‌ వాడే వినియోగదారులందరికి జీరో బిల్లులు జారీ చేస్తోందని జిల్లాలో ఒక లక్షా 73 వేల 627 సర్వీసులకు గాను ఇప్పటివరకు రూ. 190 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని వివరించారు.

‘‘రైతుభరోసా’’ పథకం ద్వారా ఈ వానాకాలం పంటకు గాను ఒక లక్షా 92 వేల 628 మంది రైతులకు 206 కోట్ల 82 లక్షల రూపాయలను జమ చేయడం జరిగిందని గత యాసంగిలో సన్నరకం ధాన్యం విక్రయించిన 28 వేల 659 మంది రైతులకు 71 కోట్ల 17 లక్షల రూపాయల బోనస్ జమ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

జిల్లాలో మొదటి విడతలో 10 వేల 969 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని ఇప్పటికే 8 వేల 974 ఇండ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని గృహ నిర్మాణాన్ని బట్టి దశలవారీగా ప్రభుత్వం 222 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రెండవ విడతలో ప్రతి నియోజకవర్గానికి 1500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని డబుల్ బెడ్ రూమ్ గృహ నిర్మాణంలో భాగంగా 2 వేల 769 ఇండ్లు ప్రారంభించగా ఒక వెయ్యి 296 పూర్తయ్యాయని మంత్రి తెలిపారు.

అంతేకాకుండా ఇంటి పైకప్పు మార్చుకునేందుకు ప్రతి నియోజకవర్గానికి 500 మంది లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తున్నామని ఇందుకోసం ప్రతి గృహానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు.
జిల్లాలో ఒక లక్ష 30 వేల 42 మంది లబ్దిదారులకు ప్రతి నెలా 29 కోట్ల 99 లక్షల రూపాయల చేయూత పింఛన్లు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అర్హులైన మరింత మందికి కొత్త పింఛన్లు అందించేందుకు ఇంటింటి సర్వే పూర్తయిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 47 వేల 798 కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేయడం జరిగిందని 98 వేల 482 మంది కుటుంబ సభ్యుల పేర్లను కొత్తగా నమోదు చేశామని జిల్లాలో 3 లక్షల 22 వేల 198 కుటుంబాలకు గాను ప్రతి నెలా 6 వేల 63 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణి చేస్తున్నామని రేషన్ కార్డుదారులందరికీ స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి లక్ష్మణ్ కుమార్ వివరించారు.

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా ఈ సంవత్సరం 25 వేల 88 మందికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించడం జరిగింది. అందుకు 72 కోట్ల 50 లక్షల రూపాయలను ప్రభుత్వం నెట్ వర్క్ ఆసుపత్రులకు చెల్లించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 391 మహిళా సంఘాలకు స్వంత భవనాలు నిర్మించేందుకు అనుమతి మంజూరు చేశామని ఈ ఏడాది ఒక లక్ష 50 వేల ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీకి సిద్దంగా ఉన్నాయని మంత్రి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల పాటు చేపట్టిన “ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో 4 వేల 290 పెండింగ్ ఫైళ్లను పరిష్కరించారని అన్ని గ్రామాలలో 15 రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించామని చొప్పదండి మండలం కోనేరుపల్లి, రామడుగు మండలం వెలిచాల గ్రామాలు ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా గుర్తింపు పొందడం విశేషంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన “భూభారతి చట్టం” అమల్లో భాగంగా భూవివాదాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సమగ్ర భూసర్వే కు శ్రీకారం చుట్టామని తొలిదశలో జిల్లాలో 70 గ్రామాలు నోటిఫై చేశామని మొదటి విడతలో 7, రెండో విడతలో 9 గ్రామాల్లో భూముల రీసర్వే చేస్తున్నమని మూడో విడతలో మరో 15 గ్రామాల్లో రీసర్వే చేపట్టబోతున్నామని మంత్రి తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి సరిహద్దులను పకడ్బందీగా నిర్ణయిస్తున్నమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జిల్లాలోని ఇల్లందకుంట, గన్నేరువరం తహసిల్దార్ కార్యాలయాలకు, హుజురాబాద్, తిమ్మాపూర్, గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు నూతన భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరు అయ్యాయని ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటలు, పప్పు దినుసులు, నూనె గింజలు, తృణ ధాన్యాలు, కూరగాయల సాగు ప్రోత్సహిస్తున్నమని మంత్రి అడ్లూరి అన్నారు.

రైతులకు దీర్ఘకాలం ఆదాయం వచ్చే ఆయిల్ ఫాం పంటలను ప్రోత్సహించి సబ్సిడీ అందిస్తున్నామని ఇందులో భాగంగా గత ఏడాది జిల్లాలో 6 వేల 130 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు కాగా, వానాకాలంలో ఇప్పటివరకు 21 వేల 726 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం జరిగిందని మంత్రి వివరించారు.

చొప్పదండిలో 37 కోట్ల రూపాయలతో వంద పడకల ప్రాంతీయ వైద్యశాల నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశామని మానకొండూరులో 17.5 కోట్ల రూపాయలతో 30 పడకల సామాజిక వైద్యశాల భవనం నిర్మాణ దశలో ఉందని మంత్రి తెలిపారు. 15 కోట్ల రూపాయలతో కొత్తపల్లిలో ఆయుష్ ఆసుపత్రి నూతన భవనం నిర్మించనున్నామని కొత్తపల్లి మెడికల్ కళాశాల ఆవరణలో రూ.26 కోట్లతో మూడెకరాల్లో నర్సింగ్ కళాశాల భవనం నిర్మాణం పూర్తి కావస్తున్నదని జిల్లా యంత్రాంగం సమన్వయంతో 2 కోట్ల 98 లక్షల సీ.ఎస్.ఆర్ నిధులతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంబులెన్స్, వివిధ మిషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి 55 లక్షల రూపాయలను డి.ఎం.టి.ఎఫ్ నిధుల నుండి మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో 3 వేల 822 మంది విద్యను అభ్యసిస్తున్నారని షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ద్వారా 2 వేల 214 మంది విద్యార్థులకు అన్ని సదుపాయాలతో వసతి కల్పిస్తున్నామని ఇటీవల నోటిఫికేషన్ వెలువడిన పోలీస్ ఉద్యోగాలకు వివిధ స్టడీ సర్కిళ్లలో శిక్షణ ఇస్తున్నమని మంత్రి తెలిపారు.

బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఈ విద్యా సంవత్సరంలో 9 వేల 652 మంది విద్యార్థులకు 13 కోట్ల 82 లక్షల రూపాయల ఫీజు రియంబర్స్ మెంట్, ఉపకార వేతనాలు అందజేశామని జిల్లాలో 777 అంగన్వాడి కేంద్రాల ద్వారా 7 వేల 677 మంది గర్భిణీలు, బాలింతలకు, 40 వేల 135 మంది 7 నెలల నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు బలవర్ధక, పోషక ఆహారం అందిస్తున్నామని మంత్రి వివరించారు.

జిల్లాలో 60 అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని మంత్రి తెలిపారు. కరీంనగర్ లోని ప్రభుత్వ వయోవృద్ధులు, దివ్యాంగుల వసతిగృహంలో సిఎస్ఆర్ నిధులతో భవన మరమ్మతులు, సౌకర్యాలు కల్పిస్తున్నామని దివ్యాంగులకు ఈ ఏడాది 132 సహాయ ఉపకరణాలు పంపిణి చేశామని జిల్లాలో ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం మైత్రి క్లినిక్ సేవలు అందిస్తోందని మంత్రి తెలిపారు.

రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్‌ రెడ్డి గారికి, జిల్లా సర్వతోముఖాభివృద్దికి నిర్మాణాత్మక సహకారం, సూచనలు అందిస్తున్న గౌరవ పార్లమెంటు సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, గౌరవ స్థానిక ప్రజా ప్రతినిధులకు, జిల్లా ఉన్నతాధికారులకు, పోలీస్‌ సిబ్బందికి, న్యాయాధికారులకు, ఉద్యోగులకు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, జర్నలిస్టులకు, జిల్లా ప్రజలకు, ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ఈసందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.