దివ్యాంగుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
81 మంది విద్యార్థులకు 108 సహాయక ఉపకరణాల అందజేత
ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
దివ్యాంగ విద్యార్థుల సంక్షేమం, వారి విద్యా హక్కుల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి అన్నారు. దివ్యాంగ విద్యార్థుల విద్యాభివృద్ధి, స్వయం సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.
సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని భవిత కేంద్రంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని 81 మంది దివ్యాంగ విద్యార్థులకు 14 రకాల 108 సహాయక ఉపకరణాలు, కిట్లను పంపిణీ చేశారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీల్‌చైర్లు, హియరింగ్ ఎయిడ్స్, ట్రైసైకిళ్లు, వాకర్లు, విద్యా సామగ్రి తదితర ఉపకరణాలను అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఎమ్మెల్యే ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమాజంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గమనిస్తోందని, వారికి అన్ని విధాలుగా అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులు కూడా సమాజంలో సమాన హక్కులతో జీవించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
విద్య, ఉపాధి, వైద్య సేవలు, పునరావాసం వంటి రంగాల్లో ప్రత్యేక పథకాల ద్వారా దివ్యాంగులకు ప్రోత్సాహం అందిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దివ్యాంగ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దివ్యాంగ పిల్లలకు కూడా నాణ్యమైన విద్య, అవసరమైన సహాయక ఉపకరణాలు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ మాట్లాడుతూ, దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రభుత్వం “నా విద్య” కార్యక్రమం ద్వారా ప్రత్యేక సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు స్కాలర్షిప్‌లు, ఫిజియోథెరపీ సేవలు, ప్రత్యేక శిక్షణతో పాటు అవసరమైన విద్యా సహాయక ఉపకరణాలను అందిస్తున్నామని చెప్పారు. ప్రతి దివ్యాంగ విద్యార్థి సాధారణ విద్యతో పాటు నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, నాగర్‌కర్నూల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, విలీన విద్య కోఆర్డినేటర్ వెంకటయ్య, వెంకటేశ్వర శెట్టి, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్, ఉపాధ్యాయులు, దివ్యాంగ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.