ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
మాజీ సీఎం కేసీఆర్ గురువు, జగిత్యాలకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు, రిటైర్డ్ లెక్చరర్ డా. జైశెట్టి రమణయ్య శుక్రవారం ఉదయం మృతి చెందారు. తన గురువు రమణయ్య మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత, కె.చంద్రశేఖర రావు విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా తనకు గురువుగా, అత్యంత ఆత్మీయుడైన రమణయ్యతో తనకున్న అనుబంధాన్ని కెసిఆర్ స్మరించుకున్నారు. రమణయ్య సిద్దిపేటలో లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలో, తను ఇంటర్మీడియట్ విద్యార్థిగా తన దగ్గర విద్యనభ్యసించిన సందర్భాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వారి మరణంతో శొకతప్త హృదయయులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

రమణయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా 1971 లో సిద్దిపేటలో జూనియర్, డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ గా డా. జైశెట్టి రమణయ్య పని చేశారు. చిన్న వయసులోనే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన అరుదైన వ్యక్తిగా, జగిత్యాలలో మొట్టమొదట పొందిన డాక్టరేట్ పొందిన పరిశోధన విద్యార్థిగా వారికి పేరున్నది. అలాగే “సౌత్ ఇండియా టెంపుల్స్” అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని సమర్పించి జైశెట్టి రమణయ్య పీహెచ్డి డాక్టర్ పట్టాను పొందారు. అలాగే కరీంనగర్ జిల్లా సంస్కృతి చరిత్ర పేరుతో ఉమ్మడి జిల్లాలోని ముఖ్యమైన ప్రాంతాలు, గుడులు, ఇతర చరిత్ర ల గురించి పూర్తిగా సమాచారంతో పుస్తకాన్ని రూపొందించారు. ఈ మేరకు శుక్రవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రమణయ్య మృతదేహం వద్ద నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రమణయ్య కుమారుడు అమెరికా నుంచి బయలుదేరారని, ఆదివారం అంతక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది