Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో భానుడి భగభగ

నిప్పుల కొలిమి
అనేక జిల్లాలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత
మరో 3 డిగ్రీలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
మిగతా అన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరి

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 దాటిందంటే చాలు భానుడి భగభగలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక ఉదయం 10 తర్వాత రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు చాలా పట్టణాల్లో ఇదే పరిస్థితి. ఇక తీవ్రమైన ఎండలకు తోడు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల కింద సేదతీరుతున్నారు. కాగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరో 3 డిగ్రీలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు గురువారం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. మిగతా అన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. నేటి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 8న రాష్ట్రంలోని 20 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణశాఖ తెలిపింది. వచ్చే మూడ్రోజులు ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని చెప్పింది. గతేడాదితో పోలిస్తే అన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో 41.5 డిగ్రీల సెల్సియస్, నల్లగొండ జిల్లా నేరడుగొమ్మలో 41.5 డిగ్రీల సెల్సియస్, సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో 41.4 డిగ్రీల సెల్సియస్, జనగామ జిల్లా పాలకుర్తిలో 41.2 డిగ్రీల సెల్సియస్, వరంగల్‌ జిల్లా సంగెంలో 41.2 డిగ్రీల సెల్సియస్, హైదరాబాద్‌లో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు.

అప్రమత్తంగా ఉండండి
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండలో శరీరం నుంచి చెమట రూపంలో నీరు, లవణాలు బయటకు పోతాయని.. కాబట్టి దాహం వేయకపోయినా తరచుగా నీరు తాగుతూ ఉండాలని చెబుతున్నారు. మంచినీటితో పాటు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందుతాయని అంటున్నారు. చక్కెర శాతం ఎక్కువగా ఉండే శీతల పానీయాలు, కెఫిన్ అధికంగా ఉండే కాఫీ, టీలకు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుందని.. అత్యవసరమైతే తప్ప ఈ సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిదని అంటున్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలని.. తలకు ఎండ తగలకుండా గొడుగు, టోపీ వంటివి ధరించాలి అంటున్నారు. కళ్లకు రక్షణగా సన్ గ్లాసెస్ వాడటం మంచిదని చెబుతున్నారు. వేసవిలో తేలికపాటి ఆహారం తీసుకోవాలని.. వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.