ముద్ర కూకట్‌పల్లి :
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో జేఎన్‌టీయూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆవేదన వ్యక్తం చేసింది. శనివారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశం అనంతరం ఫోరం నాయకులు జవాజీ దిలీప్, రాహుల్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వేలాది మంది ఇంజనీర్లను తీర్చిదిద్దుతున్న జేఎన్‌టీయూకు ఈ బడ్జెట్‌లో కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం అత్యంత విచారకరమని వారు పేర్కొన్నారు.
అనుబంధ కళాశాలల దుస్థితి: విశ్వవిద్యాలయం పరిధిలోని 8 అనుబంధ కళాశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, పరిశోధన సౌకర్యాల కోసం నిధులు లేకపోవడం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేయడమేనని మండిపడ్డారు.ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి జేఎన్‌టీయూ అభివృద్ధి కోసం రూ. 500 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
”సాంకేతిక విద్యకు వెన్నెముకగా ఉన్న జేఎన్‌టీయూని నిర్లక్ష్యం చేయడం సరికాదు. తక్షణమే నిధులు విడుదల చేసి విద్యార్థుల అవసరాలను తీర్చాలి.” – స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోర ఈ విషయమై త్వరలోనే ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించనున్నట్లు నాయకులు తెలిపారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో, జేఎన్‌టీయూలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరాహార దీక్ష చేపడతామని వారు హెచ్చరించారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు