ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టు కట్టా ఉమాశంకర్ గౌడ్ అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జర్నలిస్టు యూనియన్ నాయకులు సాతాపూర్ గ్రామంలోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని సూచించారు. సుదీర్ఘకాలంగా జర్నలిజం రంగంలో సేవలు అందిస్తూ అనేక మందికి సహాయం చేసిన ఉమాశంకర్ గౌడ్ అనారోగ్యానికి గురవడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టులందరూ ఆయనకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. త్వరగా కోలుకొని మళ్లీ జర్నలిస్టుగా సేవలు అందించాలని ఆకాంక్షించారు.
తనను పరామర్శించేందుకు వచ్చిన సహచర జర్నలిస్టులను చూసి కట్టా ఉమాశంకర్ గౌడ్ భావోద్వేగానికి లోనయ్యారు. తన కోసం అందరూ రావడం ఆనందంగా ఉందని తెలిపారు. జర్నలిస్టుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా కార్యదర్శి రేసోజు సురేష్ కుమార్, కొల్లాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు మాలె రాజేందర్ గౌడ్, కార్యదర్శి బొల్గాం వెంకటస్వామి, జిల్లా సహాయ కార్యదర్శి పి. వినోద్ కుమార్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఈసీ సభ్యుడు వెంకటేశ్వర చారి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.