ముద్ర కూకట్ పల్లి :
ప్రజల కనీస అవసరాలైన తాగునీరు, విద్యుత్తు, రహదారుల వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు.
ఆదివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి ధర్మారెడ్డి కాలనీ ఫేస్-2లోని పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా పార్కులో నీటి సౌకర్యం లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానిక ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రమేష్, సమస్యను వెంటనే పరిష్కరిస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు.
అనంతరం బండి రమేష్ మాట్లాడుతూ , మూసాపేట వై-జంక్షన్ వద్ద రూ. 180 కోట్లతో వంతెన నిర్మాణం, అలాగే జేఎన్‌టీయూ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంపై అధికారులతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని.. ఇందులో భాగంగా కూకట్పల్లిలో కొత్తగా ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేస్తున్నట్లు వెల్లడించారు.
కేపీహెచ్‌బీ కాలనీలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని ఆయన గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయిబాబా చౌదరి, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, ప్రవీణ్, వినోద్, రంగ మోహన్ రావు, భాను ప్రకాష్, రజిత, పిడికిడి గోపాల్ చౌదరి, శివ చౌదరి మరియు స్థానిక అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.