ముద్ర కూకట్‌పల్లి :
రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ పేర్కొన్నారు.
నగరంలోని కేర్ గుడ్ హై స్కూల్ 21వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన బండి రమేష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం ‘ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను’ ఏర్పాటు చేస్తోందని, దీనివల్ల పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య ఉచితంగా అందుతుందని తెలిపారు.”పిల్లలకు ఆస్తులు పంచకపోయినా పర్వాలేదు కానీ, మంచి విద్యను అందిస్తే వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. క్రమశిక్షణతో కూడిన విద్యే వారి భవిష్యత్తుకు పునాది” అని ఆయన అన్నారు.
విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదేనని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.