- తెలంగాణ బాగుపడటమే మా లక్ష్యం,
- రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా రైల్వే పనులకు నిధులు తెస్తున్నాం.
- కేంద్రం నిధులు, రాష్ట్రం నిధులు అని సంకుచిత వాదులు మాట్లాడుతారు.
- సమస్యలపై లెటర్ రాస్తే అధికారులు స్పందించకపోతే ఎలా.
- బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ బాగుపడటమే తమ లక్ష్యమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా సరే రైల్వే పనులకు నిధులను తామే పూనుకొని తీసుకొస్తున్నామని ఆయన చెప్పారు.ఈ మేరకు హైదరాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ ”దిశ” సమావేశంలో జరిగింది. దిశ కమిటీ చైర్ పర్సన్ హోదాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడారు. ధనికులకు పేదలకు మధ్య అంతరం పెరుగుతుందని నిజమైన పేదలు పురోభివృద్ధి కోసం కొన్ని స్కీములను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. స్మార్ట్ సిటీ, అమృత నగరాలు, స్వచ్ఛభారత్ వంటి స్కీములను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. నగరాల అభివృద్ధికి నేరుగా డబ్బులు కేటాయిస్తున్నారని ఆయన తెలిపారు.కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయనే ఉద్దేశంతో వారికి దిశా నిర్దేశం చేయడానికే దిశ సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. అనేక స్కీములలో 60 శాతం నుండి 90 శాతం నిధులు కేంద్రమే ఇస్తుందన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వ వాటా కేటాయించకపోవడం వల్ల నిధులు ఖర్చు చేయలేకపోతున్నారని ఆయన తెలిపారు.స్కిల్ డెవలప్ మెంట్ కోసం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారని, 4 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టారన్నారు. కేంద్రం స్ఫూర్తి అర్థం చేసుకోవాలని అధికారులను కోరుతున్నానని అన్నారు. కేంద్రం నిధులు రాష్ట్రం నిధులు అని సంకుచిత వాదులు మాట్లాడతారని అన్నారు.నిజమైన అభివృద్ధి కోరుకునేవారు ఇలా మాట్లాడరని అన్నారు.ఎవరు ఖర్చు చేసినా అవి ప్రజల చెమట పైసలతో కట్టిన పన్నుల సొమ్ములేనని ఎంపీ ఈటల తెలిపారు. హైదరాబాదులో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలను కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన ఫ్లైఓవర్లు తీరుస్తున్నాయని ఆయన అన్నారు.ఈ నెల ఐదవ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అనేక ఫ్లైఓవర్లను ప్రజలకు అంకితం చేస్తున్నారని ఆయన తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ఏం నిధులు ఇచ్చిందని ప్రశ్నించినవారికి ఇవి కనిపించడం లేదా ? అని ఆయన ప్రశ్నించారు.అధికారులు సమన్వయంతో సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే ఇంకా ఎన్ని నిధులైన కేంద్రం నుంచి తీసుకొస్తామని ఈటల రాజేందర్ వెల్లడించారు.రాష్ట్రప్రభుత్వ సహకారం లేకపోయినా రైల్వే పనులకు నిధులను తామే పూనుకొని తీసుకొని వస్తున్నామని అన్నారు.అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి కార్యచరణ ప్రణాళిక రూపొందించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు ఆయన సూచించారు. ఉప్పల్ నుంచి ఘట్‌కేసరి వరకు ఫ్లై ఓవర్ కోసం భూసేకరణ వేగవంతం చేయాలన్నారు.