Take a fresh look at your lifestyle.

నేషన్​ ఫస్ట్​.. పీపుల్​ ఫస్ట్

  • వికసిత్​ భారత్​ స్పూర్తిగా తెలంగాణ రైజింగ్​
  • అదే తరహాలో 2047 విజన్​ డాక్యుమెంటరీ
  • పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన.
  • వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన మా ప్రాధాన్యం
  • కులగణనలో మా అనుభవాలు పంచుతాం
  • 2028 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాం
  • నీతి ఆయోగ్​ సమావేశంలో సీఎం రేవంత్​రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వికసిత్​ బారత్ ను స్పూర్తిగా తీసుకొని తెలంగాణ రైజింగ్ కు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2047 నాటికి మన భారత దేశాన్ని సూపర్ పవర్ గా, నెంబర్ వన్ గా నిలబెట్టాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పాన్ని స్వాగతించిన సీఎం అదే స్ఫూర్తితో ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్​- 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు వెల్లడించారు. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్‌ 10వ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. దేశ సమగ్రాభివృద్ధి, తెలంగాణ పునర్నిర్మాణానికి అనుసరిస్తున్న విధివిధానాలు, భవిష్యత్తు లక్ష్యాలను సమగ్రంగా వివరించారు.తెలంగాణ రైజింగ్‌తో ప్రగతి పథంలో ముందుకు సాగుతున్న తెలంగాణ మాడల్‌ను సమావేశంలో ఆవిష్కరించారు.రాష్ట్రంలో చేపట్టిన అనేకానేక కార్యక్రమాలను సమగ్రంగా వివరించి అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు ఆర్థిక చేయూతను అందించాల్సిన అవసరాన్ని సీఎం ప్రస్తావించారు. భారత్‌ మరింత అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు సాగుతున్న ప్రస్తుత సమయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం, సహకారం, సమాఖ్య స్ఫూర్తి అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలను కేవలం ప్రయోగశాలలుగా మాత్రమే కాకుండా జాతీయ వృద్ధికి అవసరమైన చోదక శక్తిగా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సహకార ఫెడరలిజమ్ శక్తిని వినియోగించి సమానత్వం, న్యాయం, శ్రేయస్సుతో పాటు అందరికీ సమాన అవకాశాలు అందించే భారతదేశాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ‘వికసిత భారత్’ ప్రణాళికను రూపొందించడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్ విజన్ లోని నాలుగు కీలక అంశాలను సీఎం ప్రస్తావించారు.పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తామన్నారు. తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల గణన, బీసీలకు 42శాతం రిజర్వేషన్‌లు, ఎస్సీల ఉప వర్గీకరణకు ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను సిద్ధం చేసి కార్యాచరణలో పెట్టినట్లు చెప్పారు.అభివృద్దిలో, సంక్షేమంలో ఆయా వర్గాలకు న్యాయమైన వాటా ఇవ్వాలన్నది తమ సంకల్పమన్నారు. అందుకే తెలంగాణలో సామాజిక, ఆర్ధిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల గణన చేపట్టాం. బీసీలకు విద్య, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ఈ రెండు చరిత్రాత్మక నిర్ణయాలను దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణ అమలు చేయడం గర్వంగా ఉందన్నారు.దేశవ్యాప్త కులగణనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి స్వాగతించారు. కులగణనలో తెలంగాణ ప్రభుత్వం తన అనుభవాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు.

  • వన్ ట్రిలియన్ డాలర్ల జీఎస్డీపీ సాధనకు కృషి.

వన్ ట్రిలియన్ డాలర్ల జీఎస్డీపీ సాధించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొద‌టి స్థానంలో ఉండాల‌ని కోరుకుంటున్నట్లు సీఎం వెల్లడించారు. జాతీయ‌ స్థాయి అంచనాల ప్రకారం ఈ లక్ష్యం 15 ఏళ్లలో సాధ్యమవుతుందని భావిస్తున్నామన్నారు. కానీ ఈ ప్రయాణాన్ని వేగవంతం చేసి ప‌దేళ్లలోపే లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పంతో తెలంగాణ ఉందన్నారు. 2047 నాటికి జాతీయ జీడీపీకి తెలంగాణ 8 శాతం, అంటే 2.4 ట్రిలియన్ల స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేసి జాతీయ లక్ష్యాలకు చోదకంగా మన రాష్ట్రం నిలబడుతుందన్నారు.దేశంలో ఇప్పటికే పారిశ్రామిక, సాంకేతిక, పరిపాలనా సంస్కరణల్లో తెలంగాణ అగ్రగామిగా ఉండటం గర్వంగా ఉందన్నారు. ప్రస్తుతం దేశ జనాభాలో తెలంగాణ వాటా కేవలం 2.9 శాతంగా మాత్రమే ఉందన్నారు. ఆర్థిక సహకారం అందించడంలో తెలంగాణ వాటాను గణనీయంగా పెంచాలని కోరుకుంటున్నామని చెప్పారు. భారత యూనియన్‌లో అత్యంత డైనమిక్, సంపన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఎదగాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.స్థిరమైన, సమ్మిళితమైన అభివృద్ధి లక్ష్యాల సాధనలో పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలోని ఆరు మ‌హా న‌గ‌రాలైన ముంబ‌యి, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌ల పట్టణ జీడీపీలో ప్రధాన వాటాను కలిగి ఉన్నాయని సీఎం చెప్పారు.ముంబయి, ఢిల్లీ లాంటి నగరాలతో పోల్చితే ప‌రిమాణంలో చిన్నదైనప్పటికీ హైదరాబాద్ ఇప్పటికే జీడీపీలో సుమారు 2.5 శాతం స‌మ‌కూర్చుతోందని చెప్పారు. ఆర్థిక, ప్రతిభ, పెట్టుబడి, సాంకేతిక పురోగతి కేంద్రాలుగా ఉన్నఈ మహా న‌గ‌రాల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడంలో ప్రధానమంత్రి, సంబంధిత రాష్ట్రాల సీఎంల నాయకత్వంలో జాతీయ స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.ఈ టాస్క్‌ఫోర్స్‌ ఆయా న‌గ‌రాల్లో ప్రత్యేక సమగ్ర పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు పెట్టుబడులు, పాలన సంస్కరణలపై ప్రత్యేక‌మైన వ్యూహం ఉండాలన్నారు.జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఊపును తీసుకురావ‌డంతో పాటు లక్షలాది ఉద్యోగాలను సృష్టించడంలో, ప్రపంచ పట్టణ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ స్థానాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు.మూడేళ్లలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తాం.

2028 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యాన్ని నీతి అయోగ్ వేదికగా సీఎం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మహిళలకు కీలక పాత్ర ఉండేలా విధానాలు రూపొందించినట్లు ప్రకటించారు. మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు, మహిళా సంఘాలకు పాఠశాలల నిర్వహణ, శిల్పారామంలో 100 స్టాళ్లతో మహిళా బజార్ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. సోలార్ పవర్ జనరేషన్ లోనూ భాగస్వామ్యం కల్పించి మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించే కార్యక్రమాలు అమలు చేశామన్నారు.

  • యువత ఆశయాలకనుగూణంగా యూత్ పాలసీ.

దేశ భవిష్యత్తు యువత అని సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో యువతదే కీలక పాత్ర అని కొనియాడారు. అందుకే రాష్ట్రంలో యువత ఆశయాల సాధనకు అనుగుణంగా యూత్ పాలసీ అమలు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. 17 నెలల పాలనలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు సృష్టించినట్లు వివరించారు. మానవ వనరులకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ నిరుద్యోగ సమస్య నెలకొందన్నారు. నైపుణ్యాల కొరతే ఈ అంతరానికి కారణమని గుర్తించినట్లు సీఎం చెప్పారు. అందుకే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, పోలీస్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్, ఐటీఐలను అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లుగా ఆధునీకరించి స్కిల్ శిక్షణ ఇస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.

  • రైతులను కాపాడుకుంటాం.

దేశానికి వెన్నెముక అయిన రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రైతుల ఆత్మహత్యలకు అప్పులే ప్రధాన కారణమన్న సీఎం వారిని అప్పుల ఊబి నుండి బయటకు తేవడం, తిరిగి ఆ ఊబిలోకి జారిపోకుండా నిలబెట్టాలన్న లక్ష్యాలతో పని చేస్తున్నామన్నారు. తెలంగాణలో 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి వారిని రుణ విముక్తులను చేసినట్లు వివరించారు. సాగు కోసం రైతు మళ్లీ అప్పుల పాలు కాకూడదన్న ఉద్దేశంతో రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు రూ.12 వేల సాయం చేస్తున్నామని చెప్పారు. బియ్యానికి మద్ధతు ధరకు అదనంగా క్వింటాల్ కు రూ.500 చెల్లించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నామన్నారు. రైతుకు చేదోడుగా ఉండే వ్యవసాయ కూలీకి రూ.12 వేల ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. నేడు వరి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని సీఎం వెల్లడించారు. గత ఏడాది 2.90 కోట్ల టన్నుల ఉత్పత్తిని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో రైతుల కోసం చేసే వ్యయాన్ని సంక్షేమ కోణంలో కాక… ఆహార సంపద సృష్టికి పెడుతున్న పెట్టుబడిగా చూడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

  • ఆపరేషన్ సింధూర్ కు హ్యాట్సప్.

పహల్గాంలో మారణకాండ సృష్టించిన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించినందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి, భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. 1971లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నాయకత్వంలో పాకిస్థాన్ ను ఓడించి, ఆ దేశాన్ని రెండు ముక్కలుగా చీల్చిన చరిత్రను గుర్తు చేశారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, వాటికి అడ్డుకట్ట వేయటంలో139 దేశాల్లో తెలంగాణ నెంబర్-1 స్థానం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు రూ.5 లక్షల స్వయం ఉపాధి పథకాన్ని జూన్ 2 నుంచి ప్రారంభిస్తామన్నారు.

  • తెలంగాణ అభివృద్ధికి బాటలు.

2047 నాటికి ఇండస్ట్రీ, ఇన్ ఫ్రా విషయంలో తెలంగాణను అంతర్జాతీయ నగరాల సరసన నిలబెట్టే భవిష్యత్తు లక్ష్యంతో తెలంగాణ రైజింగ్​ 2047 విజన్​ ఎంచుకున్నట్లు సీఎం చెప్పారు. ఈ లక్ష్య సాధనలో తొలి అడుగుగా ఏడాదిన్నర కాలంలో అమెరికా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, దావోస్ (స్విట్జర్ లాండ్) దేశాలలో పర్యటించి రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించామని అన్నారు.తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని మూడు జోన్లుగా విభజించి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని, తెలంగాణను కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ తెలంగాణగా విభజించి వృద్ధి సాధిస్తామన్నారు. తెలంగాణలో కోర్ అర్బన్‌, సెమీ అర్బన్‌, రూర‌ల్ విభాగాల్లో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, మెట్రో రైల్ సెకండ్ ఫేజ్, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మాన్యూ ఫాక్చరింగ్ హబ్, అగ్రిబేస్డ్ ప‌రిశ్రమలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. సబర్మతీ రివర్ ఫ్రంట్, గంగా పునరుద్ధరణ ప్రాజెక్ట్ మాదిరిగా తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉందని, మెట్రో సెకండ్ ఫేజ్, రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులు ప్రస్తుతం డీపీఆర్ ల స్టేజ్ లో ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ప్రతిపాదిత డ్రై పోర్ట్ నుండి మచిలీపట్నం పోర్టుకు ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం తెలంగాణ అభివృద్ధిలో కీలకమవుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. గుడ్ గవర్నెన్స్ తో అత్యున్నత ప్రమాణాలతో పౌర సేవలను అందిస్తామనీ ఇందులో భాగంగా ‘బిల్డ్ నౌ’యాప్ ద్వారా నిర్మాణ రంగానికి వేగం పెంచినట్లు సీఎం తెలిపారు. హైదరాబాద్‌ను డేటా సెంటర్ హబ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. విద్య, వైద్యంలో అంతర్జాతీయ ప్రమాణాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ’వికసిత భారత్‌ లక్ష్య సాధన మనందరి ఆశయం. అందులో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని మా ఆకాంక్ష. “నేషన్ ఫస్ట్ – పీపుల్ ఫస్ట్” అన్న ప్రాధాన్యతతో ముందుకు వెళ్తున్నాం. ఈ దేశం రాష్ట్రాల సమాఖ్య. కేంద్రం సహాయ సహకారం మద్దతు లేకుండా తెలంగాణ రైజింగ్ విజన్ అమలు చేయలేం. తెలంగాణ సమగ్రాభివృద్ధికి సహకరించండి, వికసిత భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ మొదటి వరుసలో ఉంటుందని మాట ఇస్తున్నాను..’ అని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.

Leave A Reply

Your email address will not be published.