Take a fresh look at your lifestyle.

‘ఈటల’కు వెన్నుపోటు..?

  • ఆయనపైనే అసలు కత్తి.
  • ఫస్ట్​ టార్గెట్​ఎంపీ..?
  • కాళేశ్వరం నోటీసుల్లో బిగ్​ ప్లాన్.
  • ఇటీవల దూకుడు పెంచిన రాజేందర్.
  • హైడ్రా, ఆర్థిక అంశాల్లో నిలదీత.
  • ఇదే సమయంలో కాషాయ అధ్యక్ష పదవి ఖాయమనే సంకేతాలు.
  • బ్రేక్​ వేసేందకే ఈటలకు కాశేశ్వరం నోటీసులు..?
  • బీజేపీలోని కొంతమంది నేతల పరోక్ష సాయం.
  • రేవంత్​ రెడ్డి ద్వారా కమిషన్​ తో నోటీసులు.
  • రాష్ట్రంలో విస్తృత చర్చ.

ముద్ర, తెలంగాణ బ్యూరో : గడిచిన పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్​ కలల ప్రాజెక్టు కాళేశ్వరంపై రోజుకో వివాదం నడుస్తూనే ఉంది. దీనిపై పీసీ ఘోష్​ కమిషన్​ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కమిషన్‌ ముగ్గురు కీలక నేతలకు నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల్లో నిర్మాణ లోపాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం నియమించిన  పీసీ ఘోష్‌ నేతృత్వంలోని విచారణ కమిషన్‌ ఇప్పటిదాకా వందల మంది ఇంజినీర్లను, పలువురు సలహాదారులను, నిర్మాణ సంస్థలను విచారించి, వారి నుంచి అఫడవిట్లు తీసుకున్నది. తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌, ఇరిగేషన్‌ మాజీ మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌కు నోటీసులు ఇచ్చి విచారణకు రండి అంటూ పిలిచింది. అయితే. ముందు నుంచీ కేసీఆర్‌, హరీశ్‌రావుకు నోటీసులు వస్తాయనేది ఊహించినదే. కానీ, అనూహ్యంగా ఈటెల రాజేందర్‌ పేరు మీద నోటీసులు వెలువడ్డాయి. అసలు ఈ ప్రాజెక్టు బిల్లుల విషయంలో అప్పుడు ఆర్థిక శాఖ చేసిందేమీ లేదంటూ అటు ఆర్థిక శాఖ నుంచి ఎప్పుడో చెప్పుకువచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం కాళేశ్వరం కార్పొరేషన్‌ పేరుతో రుణాలు తీసుకుని.. బిల్లులు కూడా అక్కడి నుంచే విడుదల చేశారు. అంతేకాదు.. కేబినెట్‌లో సీఎం ఆమోదంతో ఒక బిల్లుపై సంతకం చేసి వస్తే.. దాన్ని ఆపేందుకు మంత్రులకు కూడా అధికారం ఉండదు. అసలు బీఆర్‌ఎస్‌ పాలనలో అప్పుడు కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, ఆఖరున హరీశ్‌రావు మినహా.. ఏ ఒక్క మంత్రికి కూడా సొంత అధికారాలు లేవనేది జగమెరిగిన సత్యం. ప్రగతి భవన్‌ నుంచి వచ్చే ఆదేశాలు పాటించడం తప్ప చేసేదేమీ లేకుండా పదవుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో ఈటెల రాజేందర్‌కు నోటీసులు ఇవ్వడం వెనక పెద్ద ప్లానే వేసినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇందులో సొంత పార్టీ నేతలకు ఏదైనా భాగస్వామ్యం ఉందా.. లేదంటే ఇటీవల దూకుడు పెంచి, అటు హైడ్రాను, ఇటు ఫైనాన్సియల్‌ ఇష్యూస్‌పై ఒంటరి పోరాటం చేస్తున్న రాజేందర్‌కు బ్రేక్‌ వేసేందుకా అనే అనుమానాలు సైతం మొదలయ్యాయి. అంతేకాదు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఖరారైందని బీజేపీలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ పదవిని రాకుండా అడ్డుకునేందుకు ఆ పార్టీలోకి కొంతమంది కీలక నేతలే ఈ ప్లాన్​ వేశారని, బీజేపీలోకి ముఖ్య నేతలు సీఎం రేవంత్​ ద్వారా ఓ కొత్త కథ నడిపించారని టాక్​ నడుస్తుంది.

  • ఇది కూడా రాజకీయ వివాదమా..?

నిజానికి, ఈ నెలాఖరుతో కాళేశ్వరం కమిషన్​ పదవీకాలం పూర్తి కావాల్సి ఉండగా.. ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. ఈ పొడింపు ఉత్తర్వులు వచ్చాయో.. లేదో.. ఆ వెంటనే ఆఘమేఘాల మీద జ‌స్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్​, హరీశ్​, ఈటల రాజేందర్​కు విడి విడిగా నోటీసులు జారీ చేసింది. ఇంత హడావుడిగా నోటీసులు ఎందుకు జారీ చేసిందనేది ఒక రాజకీయ వివాదమే అన్నట్టుగా మారింది. నిజానికి, క‌మిష‌న్ విచార‌ణ‌లో భాగంగా ఐఏఎస్‌లు, ఇంజినీర్లు విచారణకు హాజరై పూర్తిగా గ‌త ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేర‌కే పని చేశామ‌ని వివరణ ఇచ్చారు. అందులో ప్రధానంగా కేసీఆర్‌ పేరే ముందున్నది. దీంతో అప్పట్లోనే పొలిటిక‌ల్ లీడ‌ర్లను కూడా విచార‌ణ‌కు పిల‌వాల‌ని క‌మిష‌న్ భావించింది. కానీ లీగ‌ల్ స‌మ‌స్యలను దృష్టిలో పెట్టుకొని క‌మిష‌న్ ఆ ఆలోచ‌న‌ను విర‌మించుకుంది. ఎన్‌డీఎస్ఏ, విజిలెన్స్ ఎన్ఫోర్స్‌మెంట్ నివేదిక‌ల‌తో పాటు ఇంజ‌నీర్లు, ఐఏఎస్‌లు ఇచ్చిన వివ‌ర‌ణ‌ల ఆధారంగా రిపోర్ట్ ఇవ్వాల‌ని భావించింది. కానీ, తాజాగా తన ఆలోచనను మార్చుకున్న కమిషన్.. పొలిటిక‌ల్ లీడ‌ర్లను సైతం విచార‌ణ‌కు పిల‌వాల‌ని డిసైడ్ అయింది. అందుకే ప్రాజెక్టు నిర్మాణంలో భాగ‌ స్వామ్యమైన కేసీఆర్‌, హరీశ్‌రావుతో పాటు ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించారనే కారణంగా ఈటలకు నోటీసులు ఇచ్చింది. అసలే కాళేశ్వరం విచారణ మీద రోజుకో వాదన పెట్టుకుంటున్న అధికార, విపక్షాలు ..  ప్రతిప‌క్షానికి చెందిన ముగ్గురు కీల‌క నేత‌లు కేసీఆర్‌, హ‌రీష్‌రావు, ఈటల‌ను విచార‌ణ చేసేందుకు క‌మిష‌న్ సిద్ధం కావ‌డంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినట్లు అయింది. విచారణకు రావాలని కమిషన్ అయితే ముగ్గురు నేతలకు నోటీసులైతే జారీచేసింది. కానీ వీరిలో ఇప్పటికే ఈటల రాజేందర్​ తాను విచారణకు వస్తానంటూ పరకటించారు. ఇక, కేసీఆర్​, హరీశ్​ నుంచి ఇంకా ఎలాంటి రిప్లై రాలేదు. గతంలో భూపాలపల్లి కోర్టు కూడా ఇలాగే కాళేశ్వరం విషయంలో కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తే.. హైకోర్టులో పిటిషన్​ వేసి తప్పించుకున్నారు. దీంతో ఇప్పుడు  అసలు కమిషన్ ముందు విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

  • ఈటల వెనక ఏం జరిగింది..?

మొన్నటిదాకా కేసీఆర్‌, హరీశ్‌రావును కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో బాధ్యులుగా చేసేందుకు కీల‌క అస్త్రం ల‌భించిందని, దాంతో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రులు హ‌రీష్‌రావుకు ఉచ్చు బిగించేందుకు రేవంత్ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఐఏఎస్​ల నుంచి మొదలుకుని ఇంజినీర్ల వరకు కేసీఆర్​ చెప్తేనే చేశాం అన్నట్టుగా కమిషన్​కు అఫడవిట్లు కూడా ఇచ్చారు.  అంతేకాదు.. నోటీసులు వస్తే విచారణకు మేము కూడా సిద్ధమే అంటూ హరీశ్‌రావు పదేపదే చెప్పారు. కానీ, తీరా సమయానికి ఈ జాబితాలో ఈటల రాజేందర్‌ చేరిపోయారు. అసలు ఈటల రాజేందర్‌కు నోటీసులు రావడం వెనక ఎవరున్నారు.. బీజేపీలో కొంతమంది నేతలు ఉద్దేశపూర్వకంగానే సీఎం రేవంత్‌ ద్వారా కమిషన్‌కు చెప్పించి నోటీసులు ఇప్పించారా అనేది కూడా బీజేపీలోని ఓ వర్గం వాదన. ఎందుకంటే గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఈటెల రాజేందర్‌కు కన్ఫర్మ్‌ అయ్యాయని బీజేపీ నేతలే చెబుతున్నారు. దానికితోడు ఇటీవల ఎంపీ ఈటల కూడా దూకుడు పెంచారు. కాషాయ దళంలో మూడో పవర్‌ పాయింట్‌గా మారుతున్నారు. అటు బీజేపీలోని బీసీ వర్గం కూడా రాజేందర్‌కు మద్దతుగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈటలకు అధ్యక్ష పదవి ఖరారు చేసిన ప్రకటన వస్తే.. కొంతమంది సీనియర్‌ నేతలకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని భయపడుతున్నట్లు చెబుతున్నారు. అందుకే ఓ కేంద్రమంత్రి, మరో సీనియర్‌ నేత కలిసి రేవంత్‌ ద్వారా నోటీసులు ఇప్పించారని, దీంతో బీజేపీ జాతీయ నేతల దగ్గర ఈటల ప్రయార్టీ తగ్గించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారని టాక్​. దానికి తోడు ప్రభుత్వంపై విమర్శలు, పలు అంశాల్లో దూకుడు పెంచిన ఈటలకు బ్రేక్‌ వేసేందుకు ఈ నోటీసులు అక్కరకు వస్తాయని అటు సీఎం కూడా భావించారని, దీంతో ఇటు తనకు అనుకూలంగా ఉంటున్న బీజేపీ మిత్రులకు కూడా సాయం చేసినట్లుగా ఉంటుందనే అంచనాతో ఈ కాళేశ్వరం విచారణలో ఈటల రాజేందర్​కు నోటీసులు ఇచ్చారని రాష్ట్రంలో చర్చ మొదలైంది.

అయితే, ఈ విచారణలో ఈటల రాజేందర్‌కు కూడా పెద్దగా జరిగే రాజకీయ ప్రమాదేమీ లేదని మరో వర్గం చెబుతోంది. ఎందుకంటే ఆనాటి ప్రభుత్వంలో సీఎం ఆదేశాలు వస్తేనే ఏదైనా జరిగింది.. ఓ జీవో అయినా వచ్చింది. ఇదే విషయాన్నిన కమిషన్‌ ముందు ఈటల చెప్పుకునే అవకాశం కూడా ఉందంటున్నారు. విచారణ పర్వం ఎలా ఉన్నా.. మాజీ మంత్రి, ఎంపీ ఈటలకు మాత్రం సొంత పార్టీ నుంచే వెన్నుపోటుదారులు తయారయ్యారంటూ కొత్త ప్రచారం మొదలైంది.

Leave A Reply

Your email address will not be published.