Take a fresh look at your lifestyle.

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

  • సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్.

ముద్ర,పానుగల్: మే 20 న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ అన్నారు.పాన్గల్ మండల కేంద్రంలో సోమవారం ప్రజాసంఘాల కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, కార్మిక,ప్రజావ్యతిరేక విధానాలు ఉపసంహరించాలని మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నామని ఈ సమ్మెను బిజెపి అనుబంధ సంఘం బిఎంఎస్ తప్ప మిగతా అన్ని కార్మిక సంఘాలు కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయని ఈ సమ్మెను విజయవంతం చేసేందుకు అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక ప్రజావ్యతిరేక విధానాలను విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు.కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను మరియు కార్పొరేటు అనుకూల, మతోన్మాద చర్యలను మరింత దూకుడుగా అమలు చేస్తున్నదని అన్నారు. కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరాలలో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ ను ముందుకు తెచ్చింది అన్నారు. వీటికి వ్యతిరేకంగా గత ఐదేళ్లుగా కార్మిక వర్గం చేస్తున్న ఆందోళన, పోరాటాలతో లేబర్ కోడ్స్ అమలు ఐదు సంవత్సరాలు ఆలస్యమైనా ఇప్పుడు వాటిని అమలు చేసి కార్మిక హక్కులను పూర్తిగా హరించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. 2025 – 26 బడ్జెట్లో తమ కార్పొరేట్ అనుకూల విధానాలకు అనుగుణంగా కేటాయింపులు చేసిందని, సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టిందని,సామాన్యులపై భారాలు వేసి కార్పొరేటు గుత్త సంస్థలకు పెట్టుబడిదారులకు వేల కోట్లు రాయితీలు ప్రకటించారు. ఉపాధి,నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి అసమానతలు, ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలను పట్టించుకోకపోగా ఈ సమస్యలను మరింత తీవ్ర రూపం దాల్చే ఆర్థిక విధానాలను విచక్షణారహితంగా అమలు చేస్తుందన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సంఘటిత ,అసంఘటిత కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఐకెపి వివో ఏలు, హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, గ్రామపంచాయతీ కార్మికులు. వ్యవసాయ కూలీలు, రైతులు, ప్రజలు తదితర అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్య నాయక్, కెవిపిఎస్ జిల్లా నాయకులు భీమయ్య, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సూర్యవంశం రాము,ఐకెపి వివో ఎల్ జిల్లా నాయకులు రాజయ్య గౌడ్,రైతు సంఘం మండల కన్వీనర్ భాస్కర్,బాలరాజు, ధర్మయ్య,భాస్కర్, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు రేణుక, అలివేలు, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు తిరుపతయ్య, హరిజనయ,చంద్రశేఖర్, కురుమయ్య, పెంటయ్య, డివైఎఫ్ఐ నాయకులు కృష్ణ. తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.