ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల రత్యేక కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్నిస్థాయిల అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాలు
ముద్ర, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి):
మార్చి 6 నుండి జూన్ 12 వరకు వివిధ అంశాలపై 99 రోజుల పాటు ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి జిల్లా అధికారులు, ఆర్డీఓలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వార్డు అధికారులు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మార్చి 6 నుండి జూ ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, పట్టణాల్లో ప్రజలకు లబ్ది చేకూర్చిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పై ప్రజలకు అవగాహన కల్పించి అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేవిధంగా చేయడమే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.

మార్చి 6 నుండి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులను అందరినీ భాగస్వాములు చేసి, జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాల్టీలల్లో కార్యక్రమాలను టీమ్ వర్క్ తో చేపట్టాలన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పరిశుభ్రత, ఫైళ్ళ క్లియరెన్స్, ఆరోగ్యం, అరైవ్ – అలైవ్, సంక్షేమం, పిల్లల భద్రత, వ్యవసాయం, విద్య, యువత, క్రీడలు, మహిళలు, పర్యావరణం వంటి ప్రభుత్వ రంగాలకు సంబంధించిన 10 థీమ్ లు ఉంటాయని, ప్రతి థీమ్ కొరకు నోడల్ అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. ప్రతి కార్యక్రమాన్ని డాక్యుమెంటేషన్ చేయాలని, పని చేయక ముందు, పని చేశాక జరిగిన కార్యక్రమ ఫొటోలు, వీడియోలు తీసుకొని డాక్యుమెంటేషన్ చేయాల్సిందిగా ఆదేశించారు. రోజువారీ కార్యక్రమాలు నివేదిక రూపంలో అందజేయాల్సి ఉంటుందని సూచించారు. మార్చి 6 నుండి 15 వరకు పరిశుభ్రత, ఫైళ్ళ క్లియరెన్స్ అనే థీమ్ ఉంటుందని, మార్చి 6న అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో కార్యక్రమ ప్రారంభోత్సవం నిర్వహించాలని ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాలలో ఫైళ్ల పరిష్కరణ అంశంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యాలయాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల వేగవంతమైన పరిష్కారం, రికార్డుల సక్రమ నిర్వహణ, ప్రజలకు సమయానుకూల సేవలందించడం లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలు, మున్సిపాలిటీలలో తడి–పొడి చెత్త వేరు సేకరణ, పిచ్చి మొక్కల తొలగింపు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త నిర్మూలన, ప్రభుత్వ భవనాల శుభ్రత కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని సూచించారు. తమ తమ కార్యాలయాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సందర్భంగా చేపట్టే ప్రతి పని ప్రజలకు స్పష్టంగా కనిపించాలని కలెక్టర్ చెప్పారు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని, ఎవరైనా అలసత్వానికి తావు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.చంద్రా రెడ్డి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) కె.శ్రీనివాస్, డీఆర్ఓ సంగీతం, జడ్పీ సి ఈ ఓ కృష్ణారెడ్డి, డిపిఓ సురేశ్ మోహన్, సిపిఓ సౌమ్య, పిడి డీఆర్డీఏ శ్రీలత, వ్యవసాయ శాఖ అధికారి ఉషా, పౌరసరఫరాల శాఖ అధికారి వనజాత, పౌరసరఫరాల శాఖ మేనేజర్ హరీష్, మిషన్ భగీరథ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, సంక్షేమ శాఖ అధికారులు రామరావు, నవీన్ కుమార్ రెడ్డి, కేషురామ్, కె.రామవేశ్వరి దేవి, పద్మావతి, ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, ఎంపిఒలు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.