ముద్ర, కోరుట్ల;
అవధూత, దత్త పీఠాధిపతి పూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి పవిత్ర కరకమలములచే గీత సత్సంగ్ వ్యవస్థాపకులు శ్రీ చీలమంతుల ఛత్రపతి గారికి బంగారు పతకం ప్రదానం కావడం పట్ల కోరుట్ల పట్టణంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. భగవద్గీత ప్రచారాన్ని జీవిత ధ్యేయంగా తీసుకుని, గీతా జ్ఞానాన్ని విద్యార్థులు, యువత, భక్తుల్లో విస్తరింపజేస్తూ సనాతన ధర్మ ప్రచారంలో విశేష సేవలు అందిస్తున్న ఛత్రపతి కి ఈ గౌరవం దక్కడం జిల్లా ప్రాంత ప్రజలకు గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు. కోరుట్ల పట్టణంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో గీత సత్సంగ్ ఆధ్వర్యంలో గీతాభిమానులు చీలమంతుల ఛత్రపతి ని అభినందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పురస్కారం కేవలం వ్యక్తిగత గౌరవం మాత్రమే కాకుండా గీత సేవకు, ఆధ్యాత్మిక విలువలకు, సనాతన ధర్మ ప్రచారానికి దక్కిన గుర్తింపని పేర్కొన్నారు.
శ్రీమద్భగవద్గీతలోని శ్లోకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, యువతలో ధార్మిక చైతన్యం పెంపొందించడంలో ఛత్రపతి చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గీత సత్సంగ్ అధ్యక్షులు శ్రీ బచ్చు శ్రీనివాస్, సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్షుడు మంచాల జగన్, చెట్పల్లి శంకర్, వనతడపుల పవన్, యాంసాని ప్రసాద్, గుండేటి బ్రుగు మహర్షి, కట్టెకొల జనార్దన్, జిల్లా శ్రీనివాస్, మంచాల జనార్ధన్, గీత సత్సంగ్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఛత్రపతి మరింత కాలం సమాజానికి గీతామృతాన్ని పంచుతూ సేవ చేయాలని ఆకాంక్షించారు.