Take a fresh look at your lifestyle.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యాయ అవగాహన సదస్సులు.

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి.
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి సూచనలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హత్నూర గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల మరియు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో న్యాయ అవగాహన సదస్సులు నిర్వహించబడినవి.
ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య మాట్లాడుతూ పిల్లలు మరియు మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరమని తెలిపారు.
బాలలపై జరిగే లైంగిక నేరాలను అరికట్టేందుకు అమలులో ఉన్న ఫోక్సో చట్టం కింద కఠినమైన శిక్షలు విధించబడుతున్నాయని వివరించారు. అలాగే డొమెస్టిక్ వైలెన్స్ చట్టం ద్వారా కుటుంబంలో మహిళలు ఎదుర్కొనే హింసకు చట్టపరమైన రక్షణ లభిస్తుందని చెప్పారు.


ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ వేధింపులు, ఆన్‌లైన్ మోసాలు వంటి సమస్యల నుండి మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎలాంటి అన్యాయం జరిగినా మహిళలు భయపడకుండా చట్టపరమైన సహాయం పొందాలని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని తెలిపారు.


విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కూడా తెలిపారు. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు అవసరమైనప్పుడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సంగారెడ్డి కార్యాలయంలో ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని చెప్పారు.
అదేవిధంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని వైద్యులను కోరారు. గ్రామస్తులు కూడా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో హత్నూర ఎస్సై శ్రీధర్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వైద్యులు, గ్రామ సర్పంచ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.