11వ తేదీలోగా అభ్యర్థులు తమ ఏజెంట్ల వివరాలను సమర్పించాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
ముద్ర, వనపర్తి :
మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ కోసం రాజకీయ పార్టీల అభ్యర్థులు ఏజెంట్లను నియామకం చేసుకొని సకాలంలో వారి వివరాలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ అంశంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ తో పాటు ఎస్పీ సునీత రెడ్డి, ఎన్నికల సాధారణ పరిశీలకులు లక్ష్మి బాయి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, ఓట్ల కౌంటింగ్ ఫిబ్రవరి 13వ తేదీన చేపట్టడం జరుగుతుందని వివరించారు. ఎన్నికల పోలింగ్ కోసం అభ్యర్థులు పోలింగ్ కేంద్రానికి ఒక ఏజెంట్ చొప్పున నియామకం చేసుకోవాలని, అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ కోసం ఒక వార్డుకు ఒక ఏజెంట్ చొప్పున నియామకం చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం ఏజెంట్ల వివరాలను ఫిబ్రవరి 11వ తేదీ లోపు ఎన్నికల అధికారులకు సమర్పించాలని తెలియ జేశారు. కౌంటింగ్ ప్రక్రియను వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి నర్సింగాయపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, పెబ్బేరు మున్సిపాలిటీ కి సంబంధించి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో, కొత్తకోట మున్సిపాలిటీకి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, ఆత్మకూరుకు సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, అమరచింతకు సంబంధించి ప్రభుత్వ జడ్పి ఉన్నత పాఠశాలలో చేపట్టడం జరుగుతుందన్నారు.
ఇక ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు 8వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అన్ని మున్సిపాలిటీలలోని అయ్యా మున్సిపల్ కార్యాలయాల్లో జరుగుతుందని, కొత్త కోటలో మాత్రమే మండల పరిషత్ కార్యాలయంలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో తప్పనిసరిగా లౌడ్ స్పీకర్ల కొరకు పోలీసు శాఖ నుంచి అనుమతి తీసుకోగలరని తెలియజేశారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల చుట్టూ ఎటువంటి ప్రచార కార్యక్రమాలు చేయడానికి వెళ్లేదని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వ్యయం లక్ష కంటే ఎక్కువ మించకూడదని, నిర్దేశించిన వ్యయం దాటితే అనర్హత వేటు పడుతుందని తెలిపారు.
బుధవారం నుండి ఓటర్ స్లిప్ పంపిణీ అధికారికంగా చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ర్యాలీలు బహిరంగ సభల కోసం అనుమతుల విషయంలో ముందస్తుగా ఎవరైతే అధికారులను సంప్రదించడం జరుగుతుందో వారికి మొదటగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏమైనా ర్యాలీలు, బహిరంగ సభలు ఉంటే ముందస్తుగా తెలియజేసి అనుమతులు తీసుకోవాలని తెలిపారు. అనుమతుల విషయంలో ముందస్తుగా వినతి పెట్టుకున్న వారికి మొదటిగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమాలు విషయంలో పక్కాగా అమలు చేస్తున్నామని ఎవరైనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నాయని , చెక్ పోస్టులను కూడా కట్టుదిట్టం చేశామని తెలిపారు. ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహిస్తామని, ఏమైనా ఉల్లంఘనలు ఇబ్బందులు ఉంటే రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు.
ఎన్నికల పరిశీలకులు లక్ష్మీబాయి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని సూచించారు. కావలసిన అనుమతులను సకాలంలో తీసుకొని సజావుగా ఎన్నికలు నిర్వహించుకునేలా సహకరించాలని తెలిపారు.
సమావేశంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
————–
జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి ద్వారా జారీ