Take a fresh look at your lifestyle.

పార్టీ నిబద్ధతే లక్ష్యం… బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ ప్రతిజ్ఞా కార్యక్రమం

 

గెలిచిన తర్వాత పార్టీ వీడను – కరీంనగర్ ప్రజల సేవకే అంకితం

అయారాం–గయారాం సంస్కృతి రాజకీయాలను కంపుకొడుతున్న ఈ కాలంలో, భారతీయ జనతా పార్టీ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. పార్టీ అభ్యర్థుల నిబద్ధతను ప్రజల ముందే స్పష్టంగా ప్రకటించేలా, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కార్పొరేటర్ అభ్యర్థులతో ‘ప్రతిజ్ఞా పర్వం’ నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

గత రెండు రోజులుగా కరీంనగర్ నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగులు, ఎన్నికల ప్రచార సభల్లో బీజేపీ అభ్యర్థులతో బండి సంజయ్ ప్రతిజ్ఞ చేయించారు. తొలిరోజు కిసాన్‌నగర్, కాపువాడ–మారుతీనగర్ చౌరస్తాలో జరిగిన కార్యక్రమాల్లో ఐదు డివిజన్ల అభ్యర్థులతో ప్రమాణం చేయించగా, రెండో రోజు కోతిరాంపూర్ చౌరస్తా, పాత లేబర్ అడ్డా వద్ద జరిగిన సభలో 9, 39, 40, 62, 63, 64 డివిజన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించడం విశేషం.

ఈ ప్రతిజ్ఞలో ప్రధానంగా గెలిచిన తర్వాత పార్టీని వీడబోనని, భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని, కరీంనగర్ అభివృద్ధితో పాటు దేశం, సమాజం, ధర్మం కోసం పనిచేస్తానని అభ్యర్థులు దైవ సాక్షిగా, తమ తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేశారు.

ప్రతిజ్ఞా పర్వం ద్వారా పార్టీ పట్ల నిబద్ధత, ప్రజల పట్ల బాధ్యతను మరింత బలపరచడమే లక్ష్యమని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత పార్టీ మార్పుల రాజకీయాలకు చెక్ పెట్టే ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని బీజేపీ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. కరీంనగర్ ప్రజల సేవకే అంకితమని చెప్పే ఈ ప్రతిజ్ఞ, స్థానిక ఎన్నికల ప్రచారంలో కొత్త ఊపును తీసుకొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.