Take a fresh look at your lifestyle.

రాజకీయ రణరంగం..! నల్గొండ మాజీ ఎమ్మెల్యేపై మంత్రి కోమటిరెడ్డి వర్డీయుల దాడి

  • స్ధానిక మున్సిపల్​ కార్యాలయంలో ఇరువర్గాల ఘర్ణణ
  • సొమ్మసిల్లి పడిపోయిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల
  • నాంపల్లి పోలీస్​ స్టేషన్​ కు మాజీ ఎమ్మెల్యే తరలింపు
  • ఇటు జుబ్లీహిల్స్ లో ప్రోటోకాల్ రగడ
  • ఎమ్మెల్యే ను అడ్డుకున్న కాంగ్రెస్​ కార్పొరేటర్లు
  • పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్​య తోపులాట
  • పటాన్ చెరు అధికార పార్టీ నేతల్లో భగ్గుమన్న విభేదాలు
  • సొంత పార్టీ ఎమ్మెల్యేను అడ్డుకున్న మంత్రి దామోదర వర్గీయులు
  • కాంగ్రెస్ శ్రేణులను దుర్భాషలాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఈ నెల 26నుంచి నాలుగు కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టేందుకు కాంగ్రెస్​ సర్కార్​ సన్నద్ధమవుతుంటే.. అర్హుల ఎంపిక విషయంలో ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష నేతలూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. క్షేత్రస్ధాయిలో పర్యటించి ప్రభుత్వ విధానాలను ఎండగట్టే పనిలో బీఆర్​ఎస్​ నేతలు నిమగ్నమయ్యారు. మరోవైపు అధికార పార్టీలోనూ వర్గ విభేదాలు రాజుకుంటున్నాయి. మంగళవారం రాష్ట్రంలో చోటు చేసుకున్న సంఘటనలు చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై దాడి జరిగింది. నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ఈ దాడి జరిగింది. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. దీంతో కంచర్ల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కాంగ్రెస్ వర్గీయులు, బీఆర్​ఎస్​ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకొని ఒకరిపై మరొకరు పూలకుండీలు విసురుకున్నారు. ఈ ఘటనలో కంచర్ల భూపాల్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. పరిస్థితి చేయిదాటే అవకాశాలుండడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు కంచర్లను నాంపల్లి పోలీస్​ స్టేషన్​ కు తరలించారు. సాయంత్ర 6గంటల ప్రాంతంలో ఆయన్ను నల్గొండలో ఆయన ఇంటికి భద్రంగా తీసుకువచ్చారు.

జూబ్లీహిల్స్​ లో ఉద్రిక్తత..!

జూబ్లీహిల్స్​ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రహ్మత్ నగర్ లో అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను స్ధానిక కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ కార్పొరేట్లు ఆందోళనకు దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ ఛార్జ్ మంత్రి ఫొటోలు లేకుండా ఎమ్మెల్యే మాగంటి తీసివేస్తున్నారంటూ కాంగ్రెస్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా ఆందోళనకు దిగిన స్థానిక కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. అనంతరం కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గోపీనాథ్ ఇక్కడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. మూడు నెలలుగా షాదీముబారక్, కల్యాణ లక్ష్మీ చెక్‌లు వచ్చినప్పటికీ సంతకాలు చేయడం లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కావాలనే చెక్‌లపై సంతకాలు చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలు తప్పకుండా ఉండాలన్నారు.

పటాన్ చేరు కాంగ్రెస్ లో ఇంటిపోరు..

పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ఇంటిపోరు రచ్చకెక్కింది. స్ధానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ వర్గాలుగా చీలిక కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం బాహాబాహికి దిగారు. రోడ్డు ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పనులు పూర్తి కాక ముందే ఎమ్మెల్యే రోడ్డు ప్రారంభించారని మండిపడ్డారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ వచ్చాక రోడ్డు ప్రారంభించాలని పట్టుబట్టారు. సొంత పార్టీ కార్యకర్తల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వారిని దుర్భాషలాడారు. ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి దామోదర వర్గీయులు మహిపాల్ రెడ్డి కి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు.

Leave A Reply

Your email address will not be published.