Take a fresh look at your lifestyle.

పేదల భూములు కబ్జా చేస్తారా ? రియల్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించిన ఎంపీ ఈటల

  • ఇండ్ల స్థలాల యాజమానులను ఇబ్బంది పెడుతున్నారంటూ ఫైర్
  • న్యాయం కోసమే చేయజేసుకున్నానని ఈటల వివరణ
  • 25 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎవర్ని కొట్టలేదు

ముద్ర, తెలంగాణ బ్యూరో : రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేదల భూములను కబ్జా చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. పేదల భూములనే కబ్జా చేస్తారా ? అంటూ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై ఎంపీ ఈటల చెంప చెల్లుమనిపించారు. ఈ మేరకు మంగళవారం నాడు మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిల నగర్ లో ఈ ఘటన జరిగింది. ఏకశిలానగర్ లో పేదలు నివాసముంటున్న భూములను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు ఎంపీ ఈటల వద్ద ఫిర్యాదు చేశారు. దీంతో ఈటల ఏకశిలానగర్ లో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళారు. అయితే ఎంపీ ఈటల ఈ ప్రాంతానికి వస్తే అడ్డుకుంటామని, టెంట్లు కూడా తగులబెడతామని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు హెచ్చరించారు.

ఈ విషయం తెలుసుకున్న ఎంపీ ఈటల పట్టుదలలో ఏకశిలానగర్ భూములను పరిశీలిస్తున్న క్రమంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వచ్చి అడ్డుకోబోయారు. దీంతో ఆగ్రహించిన ఎంపీ ఈటల రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేజేసుకున్నారు. ఈటలతో పాటు బీజేపీ కార్యకర్తలు కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్ కు దేహశుద్ధి చేశారు. ఎవరైనా పేదల భూములు ఆక్రమించితే ఖబద్దార్ అంటూ ఈటల హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లకు అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజల పక్షాన్న నిలబడాల్సిన పోలీసులు, రెవెన్యూ అధికారులు సిగ్గుపడాలన్నారు. పేదల భూముల కబ్జాపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

ఈ భూముల ఆక్రమణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి పేదలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏకశిలానగర్ మాత్రమే కాదని, బాలాజీనగర్, జవహార్ నగర్, అరుంధతి నగర్ ఇలా ఆరు నెలలుగా పేదలు కన్నీళ్ళ పరిష్కారం కోసం తిరుగుతున్నాయని ఆయన చెప్పారు. పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే రిటల్ ఎస్టేట్ బ్రోకర్ పై తాను చేజేసుకున్నట్లు ఎంపీ ఈటల వివరణ ఇచ్చారు. తన 25 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎవర్ని కొట్టలేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో శూన్యహస్తమే మిగిలిందని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కష్టపడి పనిచేసి పార్టీని నిలబెట్టాలని ఎంపీ ఈటల పిలుపునిచ్చారు.

ఏకశిలానగర్ లో 1985లో లేఅవుట్లు కొన్న 2076 మంది

ఏకశిలానగర్ లోని లేఅవుట్లను 1985లో 2076 మంది కొనుగోలు చేశారు. వారిలో ఎక్కువగా ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. అయితే 2006 సంవత్సరం నుండి ఏకశిలానగర్ లేఅవుట్లపై భూకబ్జాదారుల కన్ను పడింది. అప్పట్నుంచి కబ్జాదారుల అరాచకం నడుస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ఈ క్రమంలో ప్లాట్ ఓనర్లకు అనుకూలంగా మూడుసార్లు కోర్టు తీర్పులు వచ్చాయన్నారు. అయినప్పటికీ కబ్జాదారులు గుండాలను రంగంలోకి దింపి ప్లాట్ ఓనర్లను, మహిళపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఈటల ఆరోపించారు. ప్లాట్లలోని కరెంట్ తీగలను సైతం ధ్వంసం చేసిన గుండాలు ఎంపీ వస్తే ఏం పీకుతారంటూ వ్యాఖలు చేశారని తనకు బాధితులు ఫిర్యాదు చేయడంతోనే మహిళపై దౌర్జన్యం చేసిన రియల్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించాని ఎంపీ ఈటల వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.