- సాగర్‌పై కేంద్ర బలగాలను తొలిగించాలి
- కేఆర్ఎంబీలో తెలంగాణ వాదన
- శ్రీశైలంలో స్లూయిజ్‌కు మరమ్మత్తులు చేయాలని సూచన
- అనుమతుల్లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తారన్న రెండు తెలుగు రాష్ట్రాలు
- కేఆర్ఎంబీ సమావేశంలో వాడివేడీ
ముద్ర, తెలంగాణ బ్యూరో : సుదీర్ఘ కాలం తర్వాత కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని జలసౌధలో కేఆర్ఎంబీ ఛైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో బోర్డు సమావేశం మంగళవారం నిర్వహించగా.. తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. – మొత్తం 29 అంశాలతో కూడిన ఎజెండాపై కీలక చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రధానంగా కృష్ణా జలాల పంపిణీపై వాడీవేడీ చర్చలు జరిగాయి.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీ నీటి వాటాల పంపిణీ, బోర్డు నిర్వహణ, బడ్జెట్, రాష్ట్రాల నుంచి నిధులు, టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు, బోర్డు కార్యాలయం తరలింపు, ప్రాజెక్టుల స్వాధీనం సహా ఇతర అంశాలపై ప్రధానంగా కీలక చర్చలు జరిగాయి. కృష్ణా నదీ జలాల మళ్లింపు విషయాన్ని బోర్డు సమావేశంలో ప్రస్తావించారు. కృష్ణానదీ జలాల్లో 66:34 నిష్పత్తిపై ఈ సందర్భంగా తెలంగాణ తరపు నిరసన తెలిపారు. ముందుగా 66:34 కొనసాగిస్తూనే పరిస్థితుల్ని బట్టి పెంచే ప్రయత్నం చేస్తామని కేఆర్ఎండీ ఛైర్మన్ చెప్పడంతో.. తెలంగాణ ఇంజినీర్లు, అధికారులు అభ్యంతరం చెప్పారు. తెలంగాణలో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం 71శాతం ఉందని, పరీవాహక ప్రాంతంలో 71శాతం మేరకు వాటా ఇవ్వాలని, అది తేలేంతవరకూ కనీసం చెరి సగం నీరు ఇవ్వాలని పట్టుబట్టారు.
టెలిమెట్రిక్ స్టేషన్ల ఏర్పాటుపై ఇరు రాష్ట్రాల అభ్యంతరాలపై సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ భేటీ అనంతరం తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ మాట్లాడుతూ కృష్ణా జలాల్లో 66:34 నిష్పత్తిపై నిరసన తెలిపామన్నారు. జలాల మళ్లింపు విషయాన్ని సమావేశంలో ప్రస్తావించామని, 11 ప్రాంతాల్లో టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని కోరామని తెలిపారు. టెలిమెట్రీల ఏర్పాటుపై వారంలో స్పందిస్తామని ఏపీ ఈఎన్సీ చెప్పారని రాహుల్ బొజ్జ తెలిపారు. తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ మాట్లాడుతూ సాగర్ నుంచి సీఆర్ పీఎఫ్ బలగాలు ఉపసంహరించుకోవాలని కోరినట్లు చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతుల అంశాన్ని ప్రస్తావించామన్నారు. డ్యామ్ స్లూయిజ్ కు మరమ్మతులు చేయిస్తామని బోర్డు ఛైర్మన్ చెప్పినట్లు తెలిపారు.
50:50 నిష్పత్తిని అంగీకరించం
అనంతరం ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ అడిగిన 50:50 నిష్పత్తిని అంగీకరించబోమని బోర్డుకు చెప్పామని వెల్లడించారు. 66:34 నిష్పత్తి ప్రకారమే కొనసాగించాలని కోరామని, అదే నిష్పత్తి కొనసాగిస్తూ రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని బోర్డు చైర్మన్ చెప్పారన్నారు. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించాలని కోరామని, టెలిమెట్రీ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదిత వివరాలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థతో మోడల్ స్టడీస్ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, మోడల్ స్టడీస్ ఫలితాలు వచ్చేవరకు వచ్చే సీజన్‌కు అవసరమయ్యే అత్యవసర మరమ్మతులు చేపడతామని వెంకటేశ్వరరావు తెలిపారు
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వాహణ
రెండు రాష్ట్రాల అభ్యంతరాలను ఈ సమావేశంలో అధికారులు చర్చించారు. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సంబంధిత అంశాలను ప్రతిపాదించాయి. నాగార్జున సాగర్ డ్యాం నిర్వహణ, టెయిల్ పాండ్ లోని నాలుగు టీఎంసీల నీటి వినియోగం. శ్రీశైలం ప్లంజ్ పూల్‌కు మరమ్మత్తులు, ఆర్డీఎస్ ఆధునీకరణ, జల విద్యుత్ ఉత్పత్తి, సాగర్ ఎడమ కాలువ నష్టాలు, క్రాస్ లెవెల్స్ తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు
ప్రాజెక్టులను అనుమతుల్లేకుండా నిర్మిస్తున్నారంటూ రెండు రాష్ట్రాలు చేసిన ఫిర్యాదులు, అభ్యంతరాలపై కూడా చర్చలో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల, శ్రీశైలం కుడి కాలువ, ఆర్డీఎస్ కుడి కాలువ సహా ఇతర ప్రాజెక్టులపై తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పాలమూరు – రంగారెడ్డి, నారాయణపేట – కొడంగల్, అచ్చంపేట ఎత్తిపోతల పథకాలతో పాటు కల్వకుర్తి సామర్థ్యం పెంపు సహా జల విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ ప్రభుత్వం తరఫున అధికారులు అభ్యంతరాలను లేవనెత్తారు. దీనిపై మరోసారి చర్చిద్దామంటూ భేటీని ముగించారు. ఈ సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి రాయిపురే, మరో సభ్యుడు శంఖుహ ఇతర ఇంజినీర్లు పాల్గొన్నారు.