ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు చేరవేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో హైదరాబాదు నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ విసిలో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు విజయవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. అన్ని కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యం కావాలని తెలిపారు. ఈ నెల 12వ తేదీన, సారంగాపూర్ మండలం చించోలి (బి)లో సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం పై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి, అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ విసిలో అదనపు కలెక్టర్ లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార, సిపిఓ జీవరత్నం, డిపివో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.