సాహితీ వేత్త పార్థసారథి, అసోసియేషన్ నేత అంజిరెడ్డికి శ్రద్ధాంజలి
ముద్ర న్యూస్ బ్యూరో :
మెహిదీపట్నం : ఇటీవల మరణించిన ప్రముఖ సాహితీ వేత్త ముక్తవరం పార్థసారథికి, సంఘ సేవకుడు, వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అంజిరెడ్డికి నేతాజీ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఘనంగా నివాళులు అర్పించింది. అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సంస్మరణ సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ వారి సేవలను స్మరించుకున్నారు. అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి, ముద్ర ఎడిటర్ వై నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు జి అప్పారావు, మాజీ అధ్యక్షులు ఎ సత్యంబాబు, టీఎస్ ఆనంద్ రెడ్డి, హౌసింగ్ సొసైటీ కార్యదర్శి ఎ కృష్ణమూర్తి, అసోసియేషన్ కోశాధికారి అమర్నాథ్ రెడ్డి, సంజీవరెడ్డి, ఏం ఆంజనేయస్వామి, ప్రముఖ ఆర్టిస్ట్ అన్వర్ తదితరులు మాట్లాడుతూ పార్థసారథి మృతి తెలుగు సాహితీ రంగానికి తీరని లోటని అన్నారు. 15వ ఏటనే రచనలు ప్రారంభించిన పార్థసారథి తన 81 ఏళ్ల జీవితంలో రాసిన కథలు, నవలలు, అనువాదాలు 70 పైగా ప్రచురితమయ్యాయని వారు అన్నారు. నిరాడంబరమైన జీవితం గడిపిన పార్థసారథి రచనలే ఊపిరిగా బతికారని, సామాజిక స్పృహ కల్పించే రచనలు చేశారని వారు ప్రశంసించారు.

వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అంజిరెడ్డి నేతాజీ నగర్ కాలనీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని వక్తలు కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ సీడ్స్ కార్పొరేషన్ లో పనిచేసిన అంజిరెడ్డి 25 ఏళ్ల పాటు ఉద్యోగ సంఘం నాయకుడిగా సేవలందించారని పేర్కొన్నారు. గొప్ప స్నేహశీలి అయిన అంజిరెడ్డి కాలనీ వాసుల మనసుల్లో చిరస్థాయిగా నిలుస్తారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్థసారథి సతీమణి వసంత, అంజిరెడ్డి కుమారులు నరేంద్ర రెడ్డి, ఉజ్వల్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి, కార్యదర్శులు కే శ్రీధర్, ఎంవీ రంగారెడ్డి, అసోసియేషన్ నాయకులు సురేందర్ రావు, డాక్టర్ వరప్రసాద్, వెంకటేశ్వర్లు శ్రీనివాసరావు, పూర్ణచందర్రావు తదితరులు పాల్గొని పార్థసారథి, అంజిరెడ్డిలకు నివాళులు అర్పించారు. వారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. వారి సంస్మరణార్థం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
