ముద్ర, తెలంగాణ బ్యూరో : సాగుభూములకే రైతు భరోసా దక్కనుంది. ఈ మేరకు రైతు భరోసా పథకం మా ర్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెల 26 నుంచి ఎకరాకు రూ.12 వేలు పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నారు. భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనున్నట్లు ప్రకటించింది. తద్వారా వ్యవసాయ ఉత్పాదకత పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు ఆధునిక పద్ధతులు ఆచరించేందుకు, అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చ ని ప్రభుత్వం తెలిపింది.
భూవిస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు దీన్ని అందించనున్నారు. ఆర్వోఎస్ఆర్ పట్టాదారులకు కూడా సాయం అందజేస్తారు. సాగుయోగ్యం కాని భూములను రైతుభరోసా నుంచి తొలగించనున్నట్లు సర్కార్ స్పష్టం చేసింది. ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులకు సంబంధించిన అంశంలో పూర్తి స్పష్టత ఉండాలన్న ఉద్దేశంతో తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది.