- ఏ రంగంలో సమగ్ర అభివృద్ధి జరగ లేదు.
- ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి.
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం : రాష్ట్రాన్ని ఇప్పటి దాకా పాలించిన పాలకులందరూ ప్రజల ఆకాంక్షలను నెర వేర్చక పొగా, రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య విమర్శించారు. ఆదివార ఖమ్మం రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఖమ్మం డివిజన్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ నీళ్లు, నిధులు నియామకాల కోసం అనేక దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు పోరాడి ప్రత్యేక తెలంగాణ సాధిస్తే, ఈ 11 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న పాలకులు ప్రజల ఆకాంక్షలకనుగుణంగా అభివృద్ధి చేయ లేదన్నారు. లక్ష్యాన్ని మరిచి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దివాలా తీయించారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 75 వేల కోట్ల అప్పుతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం, ఈరోజు 6 లక్షల 70 వేల కోట్లకు చేరుకుందని అన్నారు. ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా, ఏ రంగంలో సమగ్ర అభివృద్ధిని సాధించక పోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ప్రజలు, ప్రజాస్వామ్యక వాదులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో దశ సస్యశ్యామల, సామాజిక తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధం కావాలని కోరారు. అమరుల ఆకాంక్షలు నెర వేర్చేందుకు యువతరం ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల అశోక్, ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఝాన్సీ, నాయకులు కొల్లేటి నాగేశ్వర రావు, శిరోమణి మంగతాయి, శోభ, కే శ్రీను, ఆజాద్, రాకేష్, తేజ తదితరులు పాల్గొన్నారు.