– ఎవరికి వారు తీవ్ర ప్రయత్నం
– క్యాంపులో ఉంటూనే పైరవీలు
ముద్ర, వనపర్తి :
వనపర్తి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సోమవారం జరగనుండగా ఇప్పటికీ అభ్యర్థి ఎవరన్నా పీఠముడి వీడలేదు. ఎవరికివారు లాభం చేస్తారన్న ఉద్దేశంతో అధికార పార్టీ అధినేతలు క్యాంపు నిర్వహిస్తున్నప్పటికీ, క్యాంపు లో నుండే పైరవీలు మొదలుపెట్టారు. మొదటినుండి వైశ్యుడైన ఎస్ ఎల్ ఎన్ రమేష్ సతీమణి మాధవికి ఎమ్మెల్యే మాట ఇచ్చారన్న టాక్ వినిపించినప్పటికీ, ఎన్నిక ముందు ఒక లెక్క మరో లెక్క అన్న చందంగా గెలుపొందిన అభ్యర్థులు తమకే కావాలంటూ క్యాంపు లోనే పట్టుబడుతున్నట్లు తెలుస్తుంది. బీసీ వర్గానికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు తమకే కావాలని బీసీ వర్గానికి చెందిన కౌన్సిలర్లు అధికంగా ఉన్నారని పట్టుబడుతున్నట్లు తెలుస్తుంది. వనపర్తి మున్సిపల్ చైర్మన్ పీఠం గతంలో ఎప్పుడు ఉన్నత వర్గాలకు ఇవ్వలేదని ఈసారి మాట ఇచ్చినందున మాధవికే మద్దతు తెలిపాలని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు చెప్పినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా మరో మహిళా కౌన్సిలర్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షున్ని ఎంపీని ఇతర మంత్రులను మచ్చిక చేసుకొని చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కౌన్సిలర్ల కప్ప దాటరును అడ్డుకునేందుకు ఎమ్మెల్యే క్యాంపు నిర్వహించినప్పటికీ కౌన్సిలర్ల లాబీయింగ్ మాత్రం మారడం లేదని తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం ఎవరికి చేతులెత్తి ఎవరు మద్దతు తెలుపుతారో గందరగోళంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఉత్కంఠ మధ్య సోమవారం జరిగే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఎలా ఉంటుందోనని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా వైస్ చైర్మన్ పదవి కోసం బీసీ సామాజిక వర్గంతో పాటు ఎస్సీ సామాజిక వర్గం వారు కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. చైర్మన్ పదవి ఓసి కి కట్టబెడితే వైస్ చైర్మన్ పదవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వెంకటేష్ కు ఇవ్వాలన్నది అధినాయకుల మదిలో ఉన్నట్లు తెలుస్తుంది. వనపర్తి మున్సిపాలిటీలో అత్యధిక శాతం బీసీలు గెలుపొందినప్పటికీ ఉన్నత వర్గానికి ఎస్సీకి కేటాయిస్తే బీసీల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది ఈ పీఠముడిని ఎమ్మెల్యే ఎలా విప్పుతారు, చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఎలా జరుగుతుందన్నది ఉత్కంఠకు సోమవారం మధ్యాహ్నం తెరపడనుంది.