Take a fresh look at your lifestyle.

రైతులను పట్టించుకోండి

  • వడదెబ్బకు ధాన్యపు కుప్పలపైనే అన్నదాత మృతి 
  • ఇది ముమ్మాటికి సీఎం చేసిన హత్యే
  • ధ్వజమెత్తిన కేటీఆర్
ముద్ర, తెలంగాణ బ్యూరో:  మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన గుగులోతు కిషన్ (51) అనే రైతు పంట కొనుగోలు కేంద్రం వద్ద వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఆయన ‘‘ఓవైపు ముఖ్యమంత్రి అందాల పోటీల్లో మునిగితేలుతుంటే, మరోవైపు వడదెబ్బకు తాళలేక ఓ రైతు ధాన్యపు కుప్పలపైనే ప్రాణాలు విడిచిన దురదృష్టకర పరిస్థితి కనిపిస్తోంది. ఇది ముమ్మాటికీ ముఖ్యమంత్రి చేసిన హత్యే’’ అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.‘‘పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి, రుణమాఫీ పేరిట మోసం చేసి, చివరికి పండిన పంటను కొనక వదిలేయడం వల్లే రైతన్న అనాథలా మారారు. ఇది కేవలం నిర్వాకం కాదుప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.’’అని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం అకాల వర్షాల్లో రైతుల కండ్ల ముందే నాశనమవుతోందన్నారు.మరోవైపు మండుతున్న ఎండలను తట్టుకోలేక రైతులు బలవుతున్నారన్నారు. ఈ దయనీయ పరిస్థితులకు పూర్తి బాధ్యత దద్దమ్మ కాంగ్రెస్ సర్కారుదే అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘రైతులు కొనుగోలు కేంద్రాల్లో వారాల తరబడి పడిగాపులు పడుతున్నారు. కానీ పట్టించుకునే వాడు లేరు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? అనే సందేహం ప్రజల్లో పెరుగుతోంది’’ అని వ్యాఖ్యానించారు.వడదెబ్బకు కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి బలైన గుగులోతు కిషన్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.‘‘ఇప్పటికైనా సీఎంకి సోయి ఉంటే, కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి. లేకపోతే రైతుల ఆగ్రహానికి ఈ కాంగ్రెస్ సర్కారు తట్టుకోలేని పరిస్థితికి చేరుకుంటుంది’’ అని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.