- ఆపరేషన్ ముస్కాన్ లో 84మంది బాలల సంరక్షణ, 50 కేసుల నమోదు.
- ఎస్పీ శ్రీనివాస రావు.
ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ దిగ్విజయంగా కొనసాగుతుందని ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు తెలిపారు. అన్ని శాఖల సమిష్టి కృషితో బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. పోలీసు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన వివిధ శాఖల సమన్వయంతో సమావేశంలో జిల్లా ఎస్పీ పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో హోటళ్లు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు, వ్యాపార సముదాయాలలో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి వారిని తల్లిదండ్రులకు, సంరక్షణ గృహాలకు చేర్చి యజమానులపై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇప్పటివరకు జిల్లాలో 84 మంది బాలలను రక్షించి తల్లిదండ్రులకు సంరక్షణ స్థలాలకు చేర్చడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 50 కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. బాల కార్మికులను పనిలో ఉంచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. అన్ని శాఖల సమిష్టి కృషితో కొనసాగాలని, ప్రతిరోజు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాలను సందర్శిస్తూ బాల కార్మికులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం ఓపెన్ స్కూల్ సొసైటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్ ను ఎస్పీ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్ మహేందర్, డీసీపీవో కరుణ, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చైర్మన్ ఉప్పలయ్య, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రాజు డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మధు సుధన్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.
