ముద్ర ,హనుమకొండ:
దేశాభివృద్ధిలో కాంట్రాక్టర్లది కీలకపాత్ర అని, వారికి ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందని రవీంద్ర త్యాగి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
హనుమకొండ జిల్లా మడికొండలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఐఏ) వరంగల్ చాప్టర్ ఇన్‌స్టాలేషన్ కార్యక్రమం, అలాగే జాతీయ ఉపాధ్యక్షుడు వేముల సత్యమూర్తి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో గుండు సుధారాణి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, వన్నాల శ్రీరాములు, మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, బీఏఐ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, వరంగల్ చాప్టర్ చైర్మన్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, త్వరలోనే బీఏఐ ప్రతినిధి బృందానికి సీఎం అపాయింట్‌మెంట్ కల్పిస్తానని హామీ ఇచ్చారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ మౌలిక వసతుల అభివృద్ధిలో బిల్డర్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. బీఏఐకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ వరంగల్ నగర అభివృద్ధిలో బిల్డర్ల పాత్ర అనిర్వచనీయమని అన్నారు. సత్యమూర్తి జీవితం యువతకు ఆదర్శమని కొనియాడారు.
ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ వేముల సత్యమూర్తి తనకు ఆదర్శమని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ సత్యమూర్తి తనకు కాంట్రాక్టింగ్‌లో మార్గదర్శకుడిగా నిలిచారని తెలిపారు.
కార్యక్రమంలో వేముల సత్యమూర్తి–వాణి దంపతులను ఘనంగా సత్కరించారు. బిల్డర్లు, కాంట్రాక్టర్లు, సత్యమూర్తి బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.