Take a fresh look at your lifestyle.

మున్సిపల్ ఎన్నికలకు ముగిసిన ప్రచారం

పురపోరు.. కీలక పర్వం
రాజకీయాల్లో కీలక మార్పులకు ఛాన్స్
వెనకబడితే.. గడ్డు కాలమే
రేపు ఉదయం నుంచి పోలింగ్
ఈసారి కీలకమైన డిజిటల్ వార్

ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ ప్రచారంలో మాటలు కోటలు దాటాయి. సమస్యలు ఢిల్లీకి ఎగబాకాయి. మున్సిపోల్స్ ఫలితాలతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో వెనుకబడిన వారికి గడ్డు కాలమే అన్నట్టుగా పరిస్థితి మారింది. ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికలు కేవలం పట్టణ పరిపాలన కోసమే కాదు, 2028 అసెంబ్లీ ఎన్నికలకు పునాదిగా, రాబోయే పంచాయతీ ఎన్నికలకు రిహార్సల్స్‌గా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరుగుతున్న ఈ పోరు ఇప్పుడు హస్తం వర్సెస్ కారు మధ్య అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘సెమీ ఫైనల్’గా మారింది.

పట్టు నిలుపుకునే పంతంలో కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం గాలివాటం కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉంది. ఇటీవలే ముగిసిన పంచాయతీ ఎన్నికల తొలి రెండు దశల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సుమారు 4,000 కు పైగా సర్పంచ్ స్థానాలను గెలుచుకుని జోరు మీదున్నారు. అదే ఊపును మున్సిపాలిటీల్లోనూ కొనసాగించి, పట్టణ ఓటర్లు కూడా తమవైపే ఉన్నారని చాటిచెప్పాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకోసం మంత్రులను పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులుగా నియమించి క్షేత్రస్థాయిలో వ్యూహాలు రచిస్తోంది.

పుంజుకోవాలని ఆరాటపడుతున్న బీఆర్ఎస్
అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత కుంగుబాటులో ఉన్న బీఆర్ఎస్, ఈ మున్సిపల్ ఎన్నికలను పునర్వైభవానికి మార్గంగా చూస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 1,800 స్థానాలను గెలుచుకుని తాము ఇంకా క్షేత్రస్థాయిలో బలంగానే ఉన్నామని కేడర్‌లో ధైర్యాన్ని నింపింది. పట్టణ ప్రాంతాల్లో కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోతే పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుందనే ఆందోళన గులాబీ శ్రేణుల్లో కనిపిస్తోంది.

ఆరు గ్యారెంటీలు – గెలుపు గుర్రాలా?
మున్సిపల్ ఓటర్ల తీర్పులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆరు గ్యారెంటీలు’ కీలక పాత్ర పోషించనున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం, మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి వంటి పథకాల లబ్ధిదారులు పట్టణాల్లోనే ఎక్కువగా ఉన్నారు. అయితే, రుణమాఫీ అమలులో జాప్యం, రైతు భరోసాపై సందిగ్ధతను బీఆర్ఎస్ అస్త్రంగా మలచుకుంటోంది. ఈ పథకాల వల్ల తమ జీవితాల్లో మార్పు వచ్చిందని ఓటర్లు భావిస్తే కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకే, లేదంటే ‘యాంటీ ఇంకంబెన్సీ’ సెగ తగిలే అవకాశం ఉంది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చే ఎన్నికలపై నేరుగా ప్రభావం చూపుతాయి. .

బీజేపీ కూడా గట్టి అంచనాలే పెట్టుకుంది!
బీజేపీ ఈ మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణా జిల్లాల్లో ఆ పార్టీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు, ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన ఎంపీ స్థానాల ప్రభావం పట్టణ ఓటర్లపై బలంగా ఉంటుందని అంచనా వేస్తోంది. వికసిత్ తెలంగాణ బీజేపీ సంకల్ప పత్రం 2026 పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఆస్తి పన్నులు పెంచబోమని, అవినీతి రహిత పాలన అందిస్తామని ఇచ్చిన హామీలు మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. నిజామాబాద్, కరీంనగర్ వంటి నగరాలతో పాటు ఆదిలాబాద్, మహబూబ్ నగర్ వంటి ప్రాంతాల్లో బీజేపీకి గణనీయమైన విజయావకాశాలు ఉన్నాయని, కనీసం 30% వార్డుల్లో కాషాయ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. పట్టణ ఓటర్లలో పలుకుబడి నిలబెట్టుకున్న పార్టీలు మరింత ధైర్యంగా రాజకీయాలు చేయబోతున్నాయి. దెబ్బతిన్న పార్టీలు మాత్రం కొత్త వ్యూహాలతో ప్రయత్నాలు చేయాల్సిందే.

ముగిసిన ప్రచారం
మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. కొద్దిరోజులుగా గల్లీల్లో వినిపించిన మైకుల హోరు, పార్టీల ప్రచార జోరుకు తెరపడింది. పోలింగ్‌కు కౌంట్‌డౌన్ షురూ అయింది. ఈ నెల 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలవరకు 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్‌ జరుగనుంది. 13న కౌంటింగ్‌ నిర్వహిస్తారు. మొత్తం 2,996 వార్డుల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 12,993 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 52 లక్షల మందిపైగా ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 26 లక్షల మంది, పురుష ఓటర్లు 25 లక్షల మంది ఉన్నారు. ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఈసారి రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8వేల 203 పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించింది. ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరుగుతుండటంతో, సుమారు 16వేల 301 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసి ఆయా కేంద్రాలకు పంపిణీ చేశారు. ఓటింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించి, అక్కడ 24 గంటల పాటు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు 25,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,900 సమస్యాత్మక, 1,400 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అక్కడ సీసీటీవీ మానిటరింగ్‌తో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మద్యం దుకాణాలను కూడా మూసివేశారు.

డిజిటల్ వార్
ఎన్నికలు ఏవైనా సోషల్ మీడియా ప్రభావాన్ని ఎవరూ కాదనలేరు. మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక ఇన్ ఫ్లూయన్సర్లను రాజకీయ నేతలు వాడుకున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు కేవలం గల్లీల్లో తిరుగుతూ ఓట్లు అడిగే సంప్రదాయంతో పాటు ఇప్పుడు సోషల్ మీడియాను వాడేశారు. ప్రతి ఓటరు చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఒక పోలింగ్ బూత్ గా, ప్రతి వాట్సాప్ గ్రూపు ఒక ప్రచార సభ గా మారిపోయింది. ఈ డిజిటల్ విప్లవం స్థానిక సంస్థల ఎన్నికల్లో సరికొత్త పోకడలను తీసుకువచ్చింది. ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే మైకుల హోరు, గోడ పత్రికల హడావుడి ఉండేది. కానీ ఇప్పుడు అభ్యర్థులు తమ వార్డు పరిధిలో పాపులర్ అయిన లోకల్ ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ ఛానళ్లపై ఆధారపడ్డారు. మన వార్డు అభ్యర్థి.. మన మనిషి అంటూ సాగే 60 సెకన్ల ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఓటర్లపై బలమైన ముద్ర వేసినట్లుగా భావిస్తున్నారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడానికి సినిమా పాటల పేరడీలు, మాస్ డైలాగులతో అభ్యర్థులు తమను తాము హీరోలుగా ప్రొజెక్ట్ చేసుకున్నారు.

వాట్సాప్ వార్ రూమ్స్ – క్షణాల్లో వైరల్
ప్రతి వార్డుకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు వెలిశాయి. అభ్యర్థులు డిజిటల్ వార్ రూమ్స్ ఏర్పాటు చేసుకుని పెయిడ్ వాలంటీర్ల ద్వారా నిరంతరం మెసేజ్‌లు పంపిస్తున్నారు. వార్డులోని డ్రైనేజీ సమస్యలు, రోడ్ల పరిస్థితిపై ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ఎండగడుతూ గ్రాఫిక్ కార్డ్స్, షార్ట్ వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఇది ఎంత వేగంగా జరుగుతోందంటే, ప్రత్యర్థి ఒక విమర్శ చేసేలోపే దానికి కౌంటర్ వీడియో గ్రూపుల్లో ప్రత్యక్షమవుతోంది. ఈ ఎన్నికల్లో ‘ట్రోలింగ్’ అతిపెద్ద ఆయుధంగా మారింది. ప్రత్యర్థి అభ్యర్థి గతంలో వేరే పార్టీలో ఉన్నప్పుడు చేసిన ప్రసంగాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చని వీడియోలను వెలికితీసి మీమ్స్ రూపంలో ప్రచారం చేస్తున్నారు. నాడు అలా.. నేడు ఇలా అంటూ అభ్యర్థుల ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టడం ఓటర్లలో గందరగోళాన్ని, చర్చను రేపుతోంది. వ్యక్తిగత విమర్శలు, మార్ఫింగ్ ఫోటోలు కూడా ఈ డిజిటల్ పోరులో భాగం కావడం ఆందోళన కలిగిస్తోంది.

స్మార్ట్ ఫోన్ ఓటరు – మారుతున్న తీర్పు
ఒకప్పుడు ఎన్నికల ముందు ఇచ్చే మద్యం, డబ్బు నాడిని నిర్ణయించేవి. కానీ ఇప్పుడు డిజిటల్ ప్రచారం ఓటరు ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తోంది. స్మార్ట్‌ఫోన్ చూస్తూ అభ్యర్థి వ్యక్తిత్వం, సామాజిక స్పందనను ఓటరు బేరీజు వేసుకుంటున్నాడు. ముఖ్యంగా అర్బన్ ఓటరు టీవీ వార్తల కంటే సోషల్ మీడియాలో వచ్చే వైరల్ కంటెంట్‌నే ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. ఇది సంప్రదాయ పార్టీల కంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు, చిన్న పార్టీలకు కలిసి వచ్చే అంశం.

లోకల్ పోల్స్‌లోనూ తప్పని ఫేక్ న్యూస్ బెడద
డిజిటల్ వార్‌లో ఉన్న ప్రధాన లోపం ఫేక్ న్యూస్ . ప్రత్యర్థిపై బురద చల్లడానికి తప్పుడు వార్తలను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఎన్నికల సంఘం సోషల్ మీడియాపై నిఘా పెంచినా, లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో జరిగే ప్రచారాన్ని అడ్డుకోవడం సవాల్‌గా మారింది. అభ్యర్థులు తమ ప్రచార ఖర్చులో దాదాపు 30-40 శాతం కేవలం డిజిటల్ మార్కెటింగ్ ,సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ కోసమే వెచ్చిస్తుండటం ఈ డిజిటల్ దండయాత్ర తీవ్రతకు అద్దం పడుతోంది. గల్లీలో గెలవాలంటే ఇప్పుడు కేవలం గుమ్మం తొక్కితే సరిపోదు.. ఓటరు ఫోన్ స్క్రీన్‌పై నిరంతరం కనిపిస్తూ ఉండాలి. ఈ వైరల్ రాజకీయం ఎన్నికల ఫలితాలను ఎలా తారుమారు చేస్తుందో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.