గల్లీ మోరీతో ఢిల్లీ మోడీకి ఏం సంబంధం
తెలంగాణకు ప్రధాని చేసిందేమీ లేదు
అధ్వాన్న దుస్థితికి బీఆర్ఎస్ పాలనే కారణం
బీజేపీ మొత్తం ఓవైసీ నామజపం
ఓటేస్తే.. అభివృద్ధి బాధ్యత నాదే
సీఎం రేవంత్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొందని సీఎం రేవంత్‌రెడ్డి, పట్టణ ఓటర్లు భవిష్యత్తును ఆలోచించుకొని ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. 12 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ.. పదేండ్లు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలను నిండా మోసం చేశాయని మండిపడ్డారు. బీజేపీ తెలంగాణకు ఏమైనా ప్రాజెక్టులు మంజూరు చేసిందా? అని ప్రశ్నించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని ప్రధాని మోడీనే స్వయంగా హామీ ఇచ్చారని, కానీ, హామీ మరిచిపోయారన్నారు. ఇచ్చిన హామీల గురించి చెప్పట్లేదని, కానీ, మోడీని చూసి ఓటేయాలని బీజేపీ నేతలు అడుగుతున్నారని, గల్లీ ఎన్నికలతో ఢిల్లీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గల్లీలో మోరీ నిండితే ఢిల్లీలోని మోడీకి చెప్తే క్లీన్ చేస్తారా అని సీఎం సెటైర్లు వేశారు. హైదరాబాద్ లో గతంలో వరదల్లో నీటమునిగిన వస్తువులన్నీ కేంద్రం నుంచి నిధులు తెచ్చి తిరిగిస్తామని గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ హామీ ఇచ్చారని, బండి పోతే బండి.. ఇంట్ల సామాను పోతే సామాను ఇస్తామన్న హామీని నమ్మి ఆ పార్టీకి చెందిన 50 మందిని కార్పొరేటర్లుగా గెలిపించారన్నారు. ఎన్నికలయ్యాక అడిగితే.. వస్తువులకు బీమా ఉంటుందని బండి సంజయ్ మాటమార్చారని, సత్రంలో భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి సిఫారసు లేఖ ఇచ్చినట్లుగా ఉందన్నారు.
దక్షిణాదికి తీవ్ర అన్యాయం
తెలంగాణకు రూ.లక్షల కోట్లు ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారని, దీనిపై సీఎస్‌ను వివరణ అడిగితే.. మనం రూపాయి చెల్లిస్తే.. కేంద్రం 42 పైసలు ఇస్తోందని చెప్పారన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు భాజపా తీవ్ర అన్యాయం చేస్తోందని, బిహార్ ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే.. రూ.6.16 కేంద్రం ఇస్తోందని, తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ రోజైనా కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మాట్లాడారా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మనకు అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదని, మనం చెల్లించిన నిధులు తిరిగిస్తే చాలన్నారు. కేంద్రానికి వచ్చే పన్నుల్లో దక్షాణాది రాష్ట్రాలే 40 శాతానికి పైగా చెల్లిస్తున్నాయని, కానీ ఈ రాష్ట్రాలకే అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు వచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశారని, హైదరాబాద్‌కు వచ్చిన సెమీకండక్టర్ ప్రాజెక్టును మోడీ ఒత్తిడి చేసి.. ఏపీకి తరలించారని, ఇప్పడు మోడీని చూసి ఓటేయాలని భాజపా నేతలు అడుగుతున్నారన్నారు. అసలు మున్సిపల్ ఎన్నికలకు మోదీకి ఏం సంబంధం అని, బీజేపీ నేతలకు దేవుడు అసదుద్దీన్ ఒవైసీ అని, ఆయన పేరు లేకుండా ఆ నేతల ప్రచారం ఉండదన్నారు. మత రాజకీయాల ద్వారా బీజేపీ రాజకీయ మనుగడ సాగిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ పాలనే కారణం
మున్సిపాలిటీల్లో ఉన్న అనేక సమస్యలకు బీఆర్‌ఎస్ పాలనే కారణమని సీఎం పేర్కొన్నారు. కీలక పదవులు కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఉండగా, పదేళ్ల పాటు మున్సిపల్ పాలన కూడా బీఆర్‌ఎస్ ఆధీనంలోనే సాగిందన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి మున్సిపాలిటీల అభివృద్ధిని పట్టించుకోలేదని బీఆర్‌ఎస్‌కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు.
ఈ సందర్భంగా సీఎం చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. మున్సిపాలిటీల్లో ఉన్న అనేక సమస్యలకు బీఆర్‌ఎస్ పాలనే కారణమని సీఎం పేర్కొన్నారు. కీలక పదవులు కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఉండగా, పదేళ్ల పాటు మున్సిపల్ పాలన కూడా బీఆర్‌ఎస్ ఆధీనంలోనే సాగిందన్నారు. ఇన్నేళ్లలో పేదలకు రేషన్ కార్డులు, ప్రాథమిక సాయం కూడా సరిగా అందలేదని విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో వందల ఎకరాల భూముల కబ్జా ఆరోపణలను ప్రస్తావించిన రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్–బీజేపీ రెండూ ఒకటేనని, కేంద్ర బడ్జెట్ విషయంలో పరస్పరం మద్దతు ఇచ్చుకుంటున్నాయని ఆరోపించారు. ఇప్పుడు కొత్తగా ఇచ్చే హామీలను ప్రజలు ఎలా నమ్మాలని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు లక్షల కోట్ల నిధులు ఇచ్చామని చెబుతున్నా, అవి పన్నుల వాటాలో భాగమేనని, అందులోనూ దక్షిణ రాష్ట్రాలకు తీవ్ర వివక్ష జరుగుతోందని విమర్శించారు. ఈ విషయాలపై కేంద్ర మంత్రులు ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించడంలేదని నిలదీశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వాస్తవాలను గమనించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ ద్వారా వందల కోట్లు వసూలు చేసిన ఉన్మాద పాలన వారిదని, విచారణకు పిలిస్తే ముసుగులు వేసుకుని తప్పించుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల అరెస్టు కాకుండా బీజేపీ వాళ్లను కాపాడుతోందని, యాసిడ్ పోసి కడిగితే తప్ప బీఆర్ఎస్ పట్టిన పీడ వదలదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధంగా వచ్చే నిధులను కూడా తామే తెచ్చామని గొప్పలు చెప్పుకోవడం అన్యాయమన్నారు.
ప్రజా సంక్షేమం మాది
అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి ఏకరువు పెట్టారు. మొదటి తారీఖునే జీతాలు ఇవ్వడం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం రూ.9 వేల కోట్లు కేటాయించడం వంటి విజయాలను ప్రస్తావించారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని, 70 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని గుర్తు చేశారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులతో తెలంగాణ భవిష్యత్తును మారుస్తున్నామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల తీర్పులో పన్నెండేళ్ల మోదీ పాలన, పదేళ్ల బీఆర్ఎస్ అరాచకం,యు రెండేళ్ల కాంగ్రెస్ ప్రజాపాలనను బేరీజు వేసుకోవాలని ఓటర్లను కోరారు. ఈ ప్రభుత్వం మీది.. మీ కోసం పనిచేస్తుంది. తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రంతో కొట్లాడడానికైనా సిద్ధం అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. మరో ఎనిమిదేళ్ల పాటు తామే అధికారంలో ఉంటామని, అభివృద్ధి చేసే బాధ్యతను ముఖ్యమంత్రిగా, మున్సిపల్ మంత్రిగా తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు