- 1000 టీఎంసీలు ఇచ్చి ఎంతైనా తీసుకుపో అని బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చావు.
- రేవంత్ ముర్ఖత్వం తో తెలంగాణ నష్టపోతుంది.
- గోదావరి, కృష్ణా జలాలపై సీఎంకు అజ్ఞానం.
- చంద్రబాబు దయాదక్షిణ్యాల మీద బతికే బుద్ధి పోలేదు.
- నల్లమల పులిబిడ్డవు కావు.. వెకిలిమాటలతో ఎర్రిబడ్డావు.
- చంద్రబాబు, రేవంత్ మధ్య అంబికా దర్బార్ బత్తీ సంబంధం.
- సీఎం రేవంత్ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : గోదావరి నీళ్ళు నీ అయ్య జాగిరా ? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విరుచుకుపడ్డారు. రేవంత్ ముర్ఖత్వంతో తెలంగాణ నష్టపోతుందని ధ్వజమెత్తారు. గోదావరి, కృష్ణా జలాలపై రేవంత్‌కు కనీస అవగాహన లేదని ఆయన దుయ్యబట్టారు. గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు ఇచ్చి మిగతావి వాడుకోండి అని చెప్పడానికి నువ్వెవడివి? నువ్వైమైనా రాజువా? నువ్వెలా చెబుతావు ? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమని అని రేవంత్ రెడ్డిని హరీష్ రావు నిలదీశారు.గోదావరి, కృష్ణా జలాలపై అవగాహన లేకపోతే తెలుసుకోవాలని, అజ్ఞానం, ముర్ఖత్వంతో వ్యవహరిస్తే తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందన్నారు.968 టీఎంసీలకు తెలంగాణలో ప్రాజెక్టుగా రూపకల్పన జరిగిందని, అందులో 946 టీఎంసీ సీడబ్ల్యూసీ హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చిందని ఇటీవల ఇచ్చిన ప్రెజెంటేషన్‌లో సుబ్రమణ్య ప్రసాద్ స్పష్టంగా చెప్పారన్నారు. ఈ మేరకు గురువారం తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.. చంద్రబాబు దయాదక్షిణ్యాల మీద బతికే బుద్ది రేవంత్ రెడ్డికి పోలేదని, నల్లమల పులిబిడ్డవు కావు..వెకిలిమాటలతో ఎర్రిబడ్డావు అని ఆయన విమర్శించారు. నువ్వు తెలంగాణకు కాపలాదారువు మాత్రమేనని అన్నారు. రాష్ట్ర హక్కులను చంద్రబాబుకు రాసిస్తా.. ఆంధ్ర ప్రదేశ్‌కు రాసిస్తా అంటే రాష్ట్ర ప్రజలు ఊరుకోరని ఆయన హెచ్చరించారు. ఎవరు చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. తప్పుడు సమాచారం ఇస్తే జైల్లో వేస్తామని హెచ్చరికలు పొందిన వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డికి సలహాదారుడని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బకొడుతూ ఏపీకి వత్తాసు పలుకుతూ.. ఏపీ అక్రమ ప్రాజెక్టులను కాపాడే ప్రయత్నం చేస్తే జైల్లో వేస్తామని కోర్టు బెదిరించిందన్నారు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ బత్తి అని రేవంత్ రెడ్డి అంటున్నారని, ఈరోజు చంద్రబాబు అనే భగవంతుడికి రేవంత్ అనే భక్తుడికి మధ్య ఉన్న అంబికా దర్బార్ బత్తి ఈ ఆదిత్యనాథ్ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. చంద్రబాబును అడుక్కునే బుద్ధి రేవంత్ రెడ్డికి పోతలేదని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇచ్చేది ఏంది వెయ్యి టీఎంసీలు అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లొనే 968 టీఎంసీలు కేటాయిస్తూ జీవోలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 968 టీఎంసీలలో 946 టీఎంసీలకు అన్ని అనుమతులు సాధించామన్నారు. చంద్రబాబు ఎవడు ఇచ్చేది? మనకు అనుమతులు వచ్చాక. అంటే బనకచర్ల కట్టుకో అనే అర్థం. గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నవా. సోయి ఉంది మాట్లాడుతున్నావా..? అని రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు ప్రశ్నించారు. కృష్ణా విషయంలోనూ అదే అజ్ఞానంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని హరీష్ రావు విమర్శించారు. ఆ జిల్లాలో పుట్టిన రేవంత్ రెడ్డికి కృష్ణా నదిపై అవగాహన లేకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి పదవిని పక్కన పెట్టు, గతంలో జడ్పీటీసీ, ఎమ్మెల్యేగా చేశావు కదా..? అందులో కూడా 500 టిఎంసి ఇచ్చి మొత్తం నీళ్లు తీసుకో అంటున్నారని, రేవంత్ రెడ్డి చేసిన ద్రోహానికి ఉరి తీసిన తప్పులేదన్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం, నీళ్ల కోసం ఎంతో పోరాటం చేశారు. కేసీఆర్ పాదయాత్ర తర్వాత అప్పటి ప్రభుత్వం దిగివచ్చి ఎడమ కాలువ లిఫ్టులు కూడా కుడి కాలువల మాదిరి ప్రభుత్వమే మెయింటైన్ చేస్తున్నదని అన్నారు. అణువణువు క్షణక్షణం నీళ్ల కోసం తపించిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. 750 టీఎంసీల నీళ్ళు రావాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం తరఫున వాదించామన్నారు.. సెక్షన్ 3 కోసం కేసీఆర్ పోరాటం చేశారన్నారు. కృష్ణాలో తాత్కాలిక ఒప్పందం ప్రకారం మనకు 299 టీఎంసీలే వచ్చాయన్నారు. అది ఈ కాంగ్రెస్ దరిద్రం వలనేనని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల నీటి కేటాయింపులు చేయకపోవడం వల్ల నిర్ణయం జరిగిందని హరీష్ రావు తెలిపారు.న్యాయమైన వాటా కోసం సుప్రీం కోర్టుకు వెళ్ళారని, 763 టీఎంసీ నీళ్ళు రావాలని లాయర్లకు సూచించారన్నారు. పోలవరం ద్వారా మళ్ళించే 80 టీఎంసీలలో 45 టీఎంసీలు రావాలని కూడా చేర్చారన్నారు. దాని ప్రకారం 75 శాతం డిపెండబిలిటీ కింద 555 టీఎంసీ, 65 డిపెండబులిటీ కింద 43 టీఎంసీ, యావరేజ్ కింద 120 టీఎంసీ, వాటర్ డైవర్షన్ కింద 45 టీఎంసీ అన్ని కలిపి 763 టీఎంసీలు కృష్ణా బేసిన్లో తెలంగాణకు రావాలని ట్రిబ్యునల్ ముందు అఫిడవిట్ ఫైల్ చేసిందన్నారు. మీరు చెబుతున్నది ట్రిబ్యునల్‌ను ఎఫెక్ట్ చేయదా? 500 చాలు అని ఎలా అంటావు. మన వాదనకు విలువ ఉంటదా? అని రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు నిలదీశారు.