Take a fresh look at your lifestyle.

అక్రమ కూల్చివేతలపై శాసనసభ, మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

భూదాన్ భూములపై ఆ ముగ్గురు మంత్రుల కన్ను
అందుకే నోటీసులు ఇవ్వకుండా పేదలను రోడ్డన పడేశారు
స్వార్ధ రాజకీయాల కోసం ప్రజలు, అధికారుల మధ్య చిచ్చు పెడుతున్నారు

ముద్ర, ఖమ్మం :

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు అక్రమ సంపాదన కోసం 60 ఎకకాల భూదాన్ భూములపై కన్నేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అందులో భాగంగానే ఆయా భూముల్లో నివసిస్తోన్న పేదలకు నోటీసులు కూడా ఇవ్వకుండా రోడ్డున పడేశారని మండిపడ్డారు. స్వార్ధ రాజకీయాల కోసం ప్రజలు, అధికారుల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. కచ్చితంగా ఇళ్ల కూల్చివేత పాపం మంత్రులు పొంగులేటి, భట్టి, తుమ్మలదేనన్నారు. వారికి పేదల ఉసురు తప్పకుండా తగులుతుందన్నారు. ఆ భూములకు సంబంధించి ప్రజల వద్ద ఉన్న పట్టాలు సక్రమమేనన్న కేటీఆర్.. కాంగ్రెస్‌ నేతల బుద్ధే వంకర అన్నారు. దేశంలో ఒకప్పుడు ఒరిజినల్ గాంధీలు ఉండేవారనీ ఇప్పుడు డూప్లికేట్ గాంధీలు ఉన్నారన్నారు. గురువారం ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పర్యటించిన కేటీఆర్.. భూదాన్ భూ బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి కొట్లాదామన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎసే అధికారంలో వస్తోందని కేటీఆర్ జోస్యం చెప్పారు. అప్పుడు తమ ప్రభుత్వం మీకు ఇల్లు కట్టిస్తుందని హామీ ఇచ్చారు. ఇది తన బాధ్యత అని భరోసా ఇచ్చారు. అక్రమ కూల్చివేతల గురించి శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టడమా? అని ప్రశ్నించారు. శత్రుదేశం మీద దండయాత్రకి పోయినట్లు 4వేల మంది పోలీసులతో పేదల మీద దాడి చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం తప్పు చేయకపోతే ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావులను ఇక్కడికి రమ్మనండి అని సవాల్ చేశారు. ఏ తప్పు జరగక పోతే ఆర్డీవోను ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేశారు.. ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకడిని బలి పశువు చేసి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మరోవైపు బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని కేటీఆర్‌కు వివరించారు. వెలుగుమట్లలోని 147, 148, 149 సర్వే నంబర్లలో 60 ఎకరాల భూదాన్‌ భూమి ఉండాల్సి ఉండగా.. తాము గుడిసెలు నిర్మించుకున్నది కేవలం 30 ఎకరాల్లోనే అని అధికారులు చెప్తున్నారని, మరి మిగిలిన 30 ఎకరాలు ఏమయ్యాయో అడగాలని బాధితులు కేటీఆర్‌ను కోరారు. కాగా, దశాబ్దం క్రితం ఖమ్మం జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి పొట్టకూటి కోసం నగరానికి వచ్చి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకోవడమే మేము చేసిన పాపమైందా? భూదాన్‌ భూముల్లో నివాసముంటున్న పేదలపై పెద్దలకు ఎందుకింత కంటగింపు అని బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.