ముద్ర, తెలంగాణ బ్యూరో : మాదాపూర్ కృష్ణాస్ కిచెన్ హోటల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పారు. అగ్నిప్రమాదం సంభవించడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. దీంతో ఆ ప్రాంతమంతా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో హోటల్ భోజనానికి వచ్చిన కస్టమర్లు భయభ్రాంతులకు గురయ్యారు.
భోజనాన్ని వదిలి బయటకు పరుగులు తీశారు. దీనిపై మాదాపూర్ ఫైర్ ఆఫీసర్ మహ్మద్ అబ్దుల్ ఫజల్ మాట్లాడుతూ 3:30 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని ఫోన్ వచ్చిందని, వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశామన్నారు. స్వల్ప అగ్ని ప్రమాదం కావడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, పొగ ఎక్కువగా పీల్చడంతో ఒకరు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. అయితే, ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు.