గత ఏడాది మార్చి 11న 5,816 మె.వా రికార్డ్
ఈ సారి ఫిబ్రవరిలోనే భానుడి ప్రతాపం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఎండలు ముదరనే లేదు.. అప్పుడే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మార్చి నెల ప్రారంభం కాకముందే ప్రచండ రూపం చూపుతున్నాడు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీ ఎన్పీడీసీఎల్) పరిధిలో విద్యుత్ వినియోగం సరికొత్త గరిష్ట స్థాయిని తాకింది. శనివారం ఒక్కరోజే గరిష్టంగా 6,057 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఫిబ్రవరిలో ఈ స్ధాయిలో విద్యుత్ వినియోగం ఉండడం ఇదే తొలిసారి అని ఆ సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడించారు. గత ఏడాది మార్చి 11న నమోదైన 5,816 మెగావాట్ల అత్యధిక డిమాండ్ రికార్డును ఈ ఏడాది ఫిబ్రవరిలోనే దాటేయడం గమనార్హం అన్నారు. శనివారం మీడియాకు ప్రకటన విడుదల చేసిన ఆయన… నిరంతర విద్యుత్ సరఫరాను అందించేందుకు ముందస్తు ప్రణాళికలతో చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వివరించారు. 35 కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్లు ప్రారంభించామన్నారు. 366 అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేశామన్న ఆయన 7600 ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచామన్నారు. ఓవర్‌లోడ్ ఉన్న 33 కేవీ 8 ఫీడర్ల ను విభజన చేశామనీ 1200 కి.మీ మేర 33 కేవీ ప్రత్యామ్నాయ (ఆల్టర్నేట్) లైన్ల ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. లో వోల్టేజి తగ్గించడానికి 392 కెపాసిటర్ బ్యాంకులు పెట్టామని చెప్పారు. వేసవి కాలంలో మరింత పెరగనున్న డిమాండ్‍కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు ఎన్పీడీసీఎల్ యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉందని సీఎండీ స్పష్టం చేశారు.