మొక్కజొన్న కొనుగోళ్ళు జరపాలని డిమాండ్…
పట్టణంలో నిలిచిన వాహనాల రాకపోకలు…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదని బుధవారం అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. రైతుల ఆందోళనతో జగిత్యాల పట్టణంలోని బీట్ చౌరస్తాలో నిజామాబాద్ – జగిత్యాల రహదారి పై రాకపోకలు నిలిచిపోయాయి. గత 20 రోజుల క్రితం మొక్కజొన్న పంటను విక్రయించేందుకు జగిత్యాల బీట్ కు తరలించిన ఇంకా కొనుగోళ్లు చేయటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆకాల వర్షం వస్తే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి మొక్కజొన్న కొనుగోలు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. కాగా రైతుల ఆందోళనతో రహదారి స్తంభించిన విషయాన్ని తెలుసుకున్న జగిత్యాల పట్టణ సిఐ కరుణాకర్ తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించగా నిరసనను విరమించారు.