ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ ఎంపీ అరవింద్ ల మధ్య కేంద్రీయ విద్యాలయంకు భూమి కేటాయించే విషయంలో కొనసాగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఇందులో భాగంగా జగిత్యాల రూరల్ మండలంలోని చలిగల్‌లో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం కొరకు గురువారం స్థల పరిశీలన చేశారు. ఇందులో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, డైరెక్టర్ జనరల్ వాలంతరి అనితతో కలిసి పరిశీలించారు. అలాగే వాలంతరి భూమి హద్దులు, సర్వే నెంబర్లు పరిశీలించారు. ఈ మేరకు చల్గల్ లో ఏర్పాటు చేయబోయే పాఠశాల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు, విద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక వసతులు, భవన నిర్మాణం, రహదారి సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విధంగా అన్ని వసతులతో ఆధునిక పాఠశాల నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు స్థల పరిశీలన చేయడం జరిగిందని, చేపట్టనున్న పాఠశాల నిర్మాణానికి అవసరమైన అన్ని సదుపాయాలను సమగ్రంగా, ప్రణాళికాబద్ధంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, జగిత్యాల రూరల్ తహసీల్దార్ హకిమ్, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.