తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఎన్నిక
స్క్రూటిలో తిరస్కరణకు గురైన ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్
ఎమ్మెల్యేల మద్దతు లేకుండా నామినేషన్ దాఖలు చేసిన సాయి
ప్రకటించిన రాష్ట్ర ఎన్నికలప్రధాన కమిషనర్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఊహించినట్టే జరిగింది. తెలంగాణలో రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవమైంది. రాష్ట్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఎన్నిక దాదాపు ఖరారైంది. వీరితో పాటు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి సాయి.. నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేల మద్దతు లేకుండా నామినేషన్ వేశారు. దీంతో అతని నామినేషన్ స్క్రూటినీ దశలోనే తిరస్కరణకు గురైంది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఎన్నికకు మార్గం సుగమమైంది. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల విత్ డ్రా ముగియగా సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో రాష్ట్ర ఎన్నికలప్రధాన కమిషనర్ ఎన్నికపై అధికారిక ప్రకటన చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పోటీలో లేకపోవటం, అసెంబ్లీలో ఉన్న బలాబలాల దృష్ట్యా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి సునాయాసంగా ఎన్నికయ్యారు. కాగా రాజస్థాన్ కు చెందిన సింఘ్వీ తెలంగాణ నుంచి సిట్టింగ్ మెంబర్ గా కొనసాగుతున్నారు.
అత్యంత ధనికుడు సింఘ్వీ
సింఘ్వీ తన కుటుంబ ఆస్తుల విలువ రూ.2,558 కోట్లుగా వెల్లడించారు. వ్యక్తిగతంగా తనకు ఒక్క రూపాయి కూడా అప్పులేదని ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వ్యక్తిగత చరాస్తుల విలువ రూ.1,536 కోట్లుగా వెల్లడించారు. తన భార్య అనిత పేరిట ఉన్న చరాస్తుల విలువ రూ.568 కోట్లు, హెచ్‌యూఎఫ్ పేరుట ఉన్న ఆస్తుల విలువ రూ.51 లక్షలుగా చూపించారు. అభిషేక్ తన చేతిలో రూ.69.99 లక్షలు నగదు ఉందని చెప్పారు. ఇక ఢిల్లీలో రెండు గృహాలు, మహారాష్ట్ర అలీబాగ్ నగావ్‌బీచ్‌లో ఎకరా స్థలం విలువ కలిపి మెుత్తం రూ.60 కోట్లు అని పేర్కొన్నారు. భార్య పేరిట స్థిరాస్తుల విలువ రూ.333.50 కోట్లుగా ఉందని వెల్లడించారు. హెచ్‌యూఎఫ్ పేరిట ఢిల్లీలో రూ.60 కోట్ల విలువైన 2.5 ఎకరాల స్థలం ఉన్నట్లు తెలిపారు. 2024-25 ఏడాదికి ఆదాయపన్ను శాఖకు సమర్పించిన ఐటీ రిటర్నులో వ్యక్తిగత ఆదాయం రూ.374.05 కోట్లు అని అఫిడవిట్‌లో చూపించారు.
వేం నరేందర్‌రెడ్డి ఆస్తి రూ. 41.5 కోట్లే
వేం నరేందర్‌రెడ్డి తన కుటుంబ ఆస్తుల మొత్తం విలువ రూ.41.5 కోట్లుగా వెల్లడించారు. మొత్తం అప్పులు రూ.1.62 కోట్లు ఉన్నాయని తెలిపారు. తన భార్య పేరుతో కేసముద్రంలో 7.33 ఎకరాలు, కుటుంబ ఆస్తి కింద అర్పణపల్లిలో మరో 15.17 ఎకరాల భూమి, తన పేరిట కేసముద్రంలో 1,050 గజాల వ్యవసాయేతర స్థలం ఉందన్నారు. దాంతో పాటు హైదరాబాద్, వరంగల్, కేసముద్రంలలో మూడు కమర్షియల్ బిల్డింగ్‌లు ఉన్నట్లు వివరించారు. 2024-25లో తన సంపాదన రూ.22.02 లక్షలుగా.. భార్య సంపాదన రూ.12.79 లక్షలుగా వెల్లడించారు. తన చేతిలో నగదు రూ.4.99 లక్షలు మాత్రమే ఉందన్నారు.