(ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి):
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ట్యాంక్ బండ్ వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానుభావుడని, ఆయన చూపిన మార్గం సమానత్వం, విద్య, స్వాభిమానం అనే విలువలపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆచరించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

అంతేకాకుండా, విద్య ద్వారా మాత్రమే సామాజిక, ఆర్థిక పురోగతి సాధ్యమని, యువత అంబేద్కర్ బాటలో నడిచి ఉన్నత లక్ష్యాలను సాధించాలని అన్నారు. డాక్టర్ అంబేద్కర్ దూరదృష్టి వల్లే భారతదేశం ఒక ప్రజాస్వామ్య, సమానత్వం ఆధారిత దేశంగా ఎదిగిందని,ఆయన చూపిన మార్గంలో నడవాలని, రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి రామరావు, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.