- ఆ కుటుంబానికి కాంగ్రెస్లో ఎంట్రీ ఉండదు.
- తెలంగాణకు ప్రధాన శత్రవు కేసీఆర్ కుటుంబమే.
- నా దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు ఇస్తా.
- శాఖల కేటాయింపుపై అందరితోనూ చర్చిస్తా.
- కాళేశ్వరంపై రెండు రోజుల్లో మీడియా సమావేశం.
- రాష్ట్రానికి సంబంధించి కేంద్రం దగ్గర అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డే.
- ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : తాను అధికారంలో ఉన్నంత వరకూ.. కాంగ్రెస్ పార్టీలో కొనసాగినంత వరకు కేసీఆర్ కుటుంబసభ్యులెవరూ పార్టీలో చేర్చుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు ప్రధాన శత్రువులు అని, తెలంగాణ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అని, కిషన్ రెడ్డి.. కేసీఆర్ ఇద్దరు ఒక్కటేనని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.ఢిల్లీలో ఆయన బుధవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. మంత్రుల శాఖల కేటాయింపుపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు తన దగ్గర ఉన్న శాఖలను కేటాయిస్తానని, ఇప్పట్లో శాఖల ప్రక్షాళన ఉండదని చెప్పారు. పాత మంత్రుల శాఖలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లగానే కేబినెట్లోని అందరితోనూ చర్చించి కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయిస్తానని సీఎం స్పష్టం చేశారు. పని భారం ఉందని మంత్రులు ఎవరైనా చెప్తే ఆ శాఖలను కూడా కేటాయిస్తానని చెప్పారు. సీఎంగా తన వద్ధ ఉన్న హోంశాఖ, మున్సిపల్, క్రీడలు, విద్యతో పాటు కీలకమైన 11 శాఖల నుంచే కొత్త మంత్రులకు శాఖలను కేటాయించనున్నట్లుగా వెల్లడించారు. తెలంగాణ, కర్ణాటకలలో విజయవంతమైన కులగణన ప్రక్రియను పార్టీ నాయకత్వంతో పంచుకునేందుకు అధిష్టానంతో పిలుపుతోనే తాను ఢిల్లీకి రావడం జరిగిందన్నారు. రాష్ట్ర మంత్రివర్గం విస్తరణలో సామాజిక న్యాయం పాటించామన్నారు. కాగా, నక్సలిజంకు అంతం ఉండదని, సామాజిక అసమానతలు ఉన్నంతవరకు నక్సలిజం ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. కులగణనలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కిషన్ రెడ్డి అందరి నివాసాలకు ప్రత్యేకంగా వెళ్లి వివరాలు స్వీకరించాలని హైదరాబాద్ కలెక్టర్ కు ప్రత్యేకంగా సూచించానని, అయితే ఆ నలుగురు సర్వేలో వివరాలు పంచుకోలేదన్నారు.
- కిషన్రెడ్డి.. ఏం చేశారు..?
కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి ముందుకు వస్తే వారితో కలిసి వెళ్లేందుకు నేను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై కిషన్ రెడ్డితో సమీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏ రోజైనా తెలంగాణ ప్రాజెక్టులపై కిషన్ రెడ్డి నివేదిక ఇచ్చారా అని, కనీసం తెలంగాణకు ప్రాజెక్టు ఇవ్వాలని డిమాండ్ చేశారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర క్యాబినెట్లో తెలంగాణ అంశాలను ఎప్పుడైనా కిషన్ రెడ్డి ప్రస్తావించారా అని నిలదీశారు. నిర్మల సీతారామన్ చెన్నైకు మెట్రో తీసుకువెళ్ళిందని, ప్రహ్లాద్ కర్ణాటకకు మెట్రో తీసుకెళ్లారని, తెలంగాణ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏమి తీసుకురాలేదని విమర్శించారు. తెలంగాణలో ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి కిషన్ రెడ్డి అడ్డుగా ఉన్నారన్నారు.
- నో ఎంట్రీ.
కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని చెప్పిన కవిత మళ్లీ ఆ గ్రూప్ తో ఎలా కలిసిందని సీఎం రేవంత్ ప్రశ్నించారు. దెయ్యాలున్నాయని చెప్పి ఆ గ్రూప్ తోనే కమిషన్ విచారణకు పోయిందని విమర్శించారు. దెయ్యాల్లో ఆమెకూడా భాగం అయిందా? అని ప్రశ్నించారు. వాళ్లందరూ ఒక్కటేనని, వాళ్లను ఎవరూ పట్టించుకుంటలేరనే అందరు కలిసి కొత్త చర్చకు తెర లేపారని సీఎం ఆరోపించారు. ఈ సందర్భంగా కవిత కాంగ్రెస్ లో చేరుతుందనే ఊహాగానాలను సీఎం కొట్టిపారేశారు. కవిత కొత్త పార్టీ పెట్టుకుంటుందేమో.. కాంగ్రెస్లో ఎందుకు చేరుతదని ప్రశ్నించారు.
- కాళేశ్వరంపై అన్నీ చెప్తా.
కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఏదో కథలు చెప్తుందని, ఈ ప్రాజెక్టుపై రెండు రోజుల్లో మీడియా సమావేశం నిర్వహిస్తానని సీఎం రేవంత్ రెడ్డిచెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ బయట పెడుతానని, బీఆర్ఎస్ చేసిన అవీనతి బండారం బయట పడుతుందని సీఎం చెప్పారు.