రిజర్వేషన్ బిల్లు అడ్డుకుని జాతికి ద్రోహం చేశారు
మహిళల్ని ఓటు అడిగే పార్టీలు వారి సాధికారతను ఎలా అడ్డుకుంటాయి
నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నిరసన ర్యాలీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
ముద్ర న్యూస్ , నిడదవోలు :
మహిళా రిజర్వేషన్ బిల్లుపై దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. తాజాగా ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.చంద్రబాబు మాట్లాడుతూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును అడ్డుకోవడం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి రోజు అని పేర్కొన్నారు.
నిడదవోలులో నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్న ఆయన, మహిళల సాధికారతను అడ్డుకోవడం అంటే సమాజ అభివృద్ధిని అడ్డుకోవడమేనని అన్నారు. రాజకీయ పార్టీలు మహిళల ఓట్లను కోరుతూ, అదే సమయంలో వారి హక్కులను నిరాకరించడం ద్వంద్వ వైఖరి అని విమర్శించారు. మహిళలు దేశ జనాభాలో సగం భాగం కాగా, వారికి చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం అవసరమని స్పష్టం చేశారు.
అదేవిధంగా, ఈ బిల్లును అడ్డుకున్న ప్రతిపక్షాలు మహిళలకు అన్యాయం చేశాయని పేర్కొంటూ, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉద్యమాలు చేపడతామని తెలిపారు. మహిళల అభ్యున్నతి దేశ అభివృద్ధికి కీలకం అని, వారి రాజకీయ భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. “నిన్న జరిగిన విద్రోహాన్ని ప్రతీ ఇంటికి తీసుకెళ్తాం. ఇవాళ చేపట్టిన నిరసన ఆరంభం మాత్రమే. దీనిపై పవన్ కల్యాణ్‌నూతో మాట్లాడాను. ఎన్డీఏ పక్షాలతో పాటు ఇతర పార్టీలు కూడా కలిసి రావాలి. మహిళలను ఓటు అడిగే పార్టీలు మహిళా సాధికారతను అడ్డుకుంటాయా? 2017లో టీడీపీ అధికారంలో ఉండగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బిల్లు కూడా తీసుకు రాలేక పోయారు. మహిళలు చట్ట సభలకు వస్తే న్యాయం జరుగుతుందనే ఈ సవరణ బిల్లు తీసుకువచ్చారు. మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా బిల్లును అడ్డుకున్నారు. ఏ ముఖం పెట్టుకుని మహిళల్ని ఆ పార్టీలు ఓట్లు అడుగుతాయి.? ఆ పార్టీలు చేసిన ద్రోహానికి డిపాజిట్ కూడా రాకుండా చేయాలి. ఆడబిడ్డలు పైకి వస్తే చూడలేకే ఈ బిల్లును అడ్డుకున్నారు.మొత్తానికి, మహిళా రిజర్వేషన్ బిల్లు చుట్టూ కొనసాగుతున్న ఈ రాజకీయ వివాదం దేశంలో మహిళా సాధికారతపై మళ్లీ దృష్టిని కేంద్రీకరించింది.
ఎన్డీఏ పక్షాలు నిర్వహించిన నిరసన ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, జనసేన తరపున మంత్రి కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.