Take a fresh look at your lifestyle.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు-ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే.

 

గ్రామస్తులు కలిసికట్టుగా ఉంటేనే అభివృద్ధి.

లైవ్లీ హుడ్ ఇంక్లూజివ్ ప్రోగ్రాం కు గట్టు మండలం ఎంపిక.

 

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:

ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు.

గట్టు మండలం చమన్ ఖాన్ దొడ్డి గ్రామంలో శనివారం ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న పలువురు లబ్ధిదారుల నూతన గృహాలను రిబ్బన్ కట్ చేసి ముఖ్య అతిథులు ప్రారంభించారు. గృహప్రవేశాలు చేసుకున్న ఇండ్ల యజమానులకు శుభాకాంక్షలు తెలియజేసి కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వేదిక వద్ద పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు ఒకేసారి పెద్ద ఎత్తున గృహప్రవేశాలు చేసుకోవడం సంతోషంగా ఉందని, మరో విడతలో ఇండ్లు లేని వారికి కూడా ఇందిరమ్మ గృహాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. గ్రామంలో ప్రతి ఇంటి ముందు మరుగుదొడ్లను నిర్మించుకొని, వినియోగించుకుంటున్నందుకు అభినందనలు తెలిపారు. స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. తెలంగాణ లైవ్లీ హుడ్ ఇంక్లూజివ్ ప్రోగ్రాంకు గట్టు మండలం ఎంపికవడంతో అత్యంత వెనుకబడ్డ 15 గ్రామాలను ఎంపిక చేసి, ఒక్కో గ్రామంలో 25 కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు సమన్వయకర్తల సహకారంతో ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. షుగర్, బీపీ వ్యాధులు పెరుగుతున్నాయని ప్రజలు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామస్తులు తమ పిల్లలను చక్కగా చదివించి ఉన్నత స్థాయికి చేరుకునేందుకు తోడ్పడాలని పేర్కొన్నారు. అంగన్వాడి కేంద్రాల సేవలను చిన్నారులు, గర్భిణీ, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న వారు సొంతింటి కలను సాకారం చేసుకోవడం అభినందనీయమని కొనియాడారు. వెనకబడ్డ ఈ గ్రామంలో ఒకప్పుడు తాటాకు గుడిసెలు ఎక్కువగా ఉండేవని, ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్లతో పక్కా గృహాలు నిర్మించుకునేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. బ్రతుకుతెరువు కోసం వలస పోయే పరిస్థితులను రూపుమాపి ప్రజలు సొంతంగా తమ కాళ్లపై నిలబడేలా ప్రభుత్వం అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామస్తులు ఐక్యమత్యంగా ఉంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అభిలషించారు. అంతకు ముందు సిఎస్ఆర్సి కార్యక్రమంలో భాగంగా ఎల్టీఎం, భవిష్య భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన డిజిటల్ సేవల భవనాన్ని ముఖ్య అతిధులు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో గద్వాల మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతు, గ్రామ సర్పంచ్ భీమయ్య, ఉప సర్పంచ్ రేణుక, హౌసింగ్ డిఈ కాశీనాథ్, తహసిల్దారు విజయ్ కుమార్, ఎంపీడీవో చెన్నయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.