Take a fresh look at your lifestyle.

అధ్వానంగా జూరాల కుడి,‌ఎడమ కాలువలు * కాల్వల్లో పారుతున్న నిర్లక్ష్యం!

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:
జూరాల ప్రాజెక్టు పై ఆదారపడి‌‌ ఉన్న‌ సాగునీటి సరఫరాకు వినియోగించే కుడి, ఎడమ‌ కాలువలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. కాలువల్లో పిచ్చిమొక్కలు, చెట్లు మొలిచి, పూడిక పేరుకుపోయి అధ్వానంగా కనిపిస్తున్నాయి. వర్షాలకు గండ్లు పడటం, లైనింగ్‌ చేయక ఏటా మరమ్మతులకు గురవుతున్నాయి. కాలువల నిర్వహణపై సరిగా పట్టించుకోవడం లేదు. ప్రతి యేటా జూరాల ప్రాజెక్టు అధికారులు కుడి,‌ఎడవ కాల్వల మరమ్మతుల కోసం అంచనాలు తయారు చేసి పంపుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కంటి తుడుపుగా కొన్ని నిధులు మంజూరు చేసి చేతులు దులుపుకొంటున్నారు. దీంతో ప్రధాన సమస్యలు పెరిగి పెద్దవవుతున్నాయి. దీంతో కాల్వల మనుగడే ప్రశ్నార్థకమైంది. ఈ విషయంలో అధికారులు సైతం చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే తప్పా మరమ్మతులు చేయించలేమని వారు చెబుతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం కాల్వలను పర్యవేక్షిస్తూ లోటుపాట్లను సరిచేయాల్సిన బాధ్యతను విస్మరిస్తుండంపై వారు ఆక్షేపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని కాల్వలకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

వేసవికలో మరమ్మతులకు అవకాశం

వేసవికాలంలో జూరాల ఆయకట్టుకు అధికారులు విరామాన్ని ప్రకటిస్తారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు లేకపోవడంతో రైతులు ఎవరూ పంటలు వేసుకోవద్దని సూచిస్తారు. దీంతో నీటి సరఫరాను పూర్తిగా నిలిపి వేస్తారు. మూడు, నాలుగు నెలల పాటు జూరాలకు సంబంధించి ఏ చిన్న కాల్వలోనూ చుక్క నీరు కనిపించదు. ఈ సమయంలోనే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో అది జరగటం లేదు. ప్రమాదకరంగా తయారైన చోట్లను గుర్తించి వాటిని సరి చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం మరిచిపోయింది.

మురుగు కాలువలను తలపిస్తున్న కుడి కాలువ

గద్వాల పట్టణంలో ప్రవహిస్తున్న జూరాల ప్రాజెక్టు కుడి కాలువ సరైన నిర్వహణ లేక మురుగు కాలువలను తలపిస్తున్నాయి. జూరాల కుడి కాలువ ద్వారా గద్వాల పట్టణ ప్రజలకు త్రాగు నీరు, గద్వాల, అలంపూర్ నియోజకవర్గంలోని పంట పొలాలకు సాగు నీరందిస్తున్నారు. జూరాల కుడి కాలువలో ఏళ్ల తరబడి పూడికతీత, మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల కాలువల్లో చెత్తాచెదారం, గుర్రపుడెక్క, పిచ్చిమొక్కలు పెరిగిపోయి నీరు ప్రవహించకుండా అడ్డుపడుతున్నాయి. చెనుగోనిపల్లి‌రోడ్డు,‌భీంనగర్, రెవెన్యూ కాలనీ , పాత హౌసింగ్ బోర్డు, బీరొల్లు రోడ్డు, జమ్మిచేడు వరకు గద్వాల పట్టణంలో ప్రవహిస్తున్న జూరాల కుడి‌కాలువలో నిత్యం ప్లాస్టిక్ కవర్లు, చెత్తచెదారం, వ్యర్థపదార్థాలు పారవేయడంతో కుడి కాలువ నిండా చెత్తచెదారంతో నిండుకపోయింది. జమ్ములమ్మ రిజర్వాయర్ నుంచి గద్వాల పట్టణ ప్రజలకు త్రాగు నీరందించే కుడి కాలువలో భీంనగర్ , రెవెన్యూ కాలనీ, పాత హౌసింగ్ బోర్డు కాలనీ ల నుంచి డ్రైనేజి నీళ్లు కుడికాలువలో ప్రవహిస్తున్నట్లు ఆరోపణలు. ఇదే కుడి కాలువ నీరు ఫిల్టర్ చేసి త్రాగునీరందిస్తున్నారు. అలాగే పలు చోట్ల కుడి కాలువ ధ్వంసం కావండతో‌ పొలాలకు అందాల్సిన సాగునీరు వృథాగా పోతుండడంతో ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వేసవి కాలంలో కాలువలోని చెత్త చెదారాని తొలగించి, కాలువ మరమ్మతులు చేయాలని రైతులు పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్న ఇరిగేషన్ అధికారులు ఏమాత్రం చర్య లు తీసుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.